బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ జనరేటర్ ని ప్రారంభించినట్లు చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ తెలియజేసారు. ఇంకా బాలక్రిష్ణ ఏమన్నారంటే “ఈ ఆక్సిజన్ జనరేటర్ VSA ఆధునిక సాంకేతికతతో అమెరికాలో PCI అనే కంపెనీ ద్వారా తయారుచేయబడింది. దీని విలువ సూమారు రూ|| 1.2 కోట్లు, ఇది 95% నాణ్యతతో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సందర్భంగా దీనిని బహూకరించిన Novartis కంపెనీవారికి నా ధన్యవాదములు తెలియేజేస్తున్నాను. NOVARTIS కంపెనీ ద్వారా మన ఆసుపత్రికి సుమారు రూ|| 3.5 కోట్లు డోనేషన్స్ రూపంలో రావడంలో ఎంతో కృషి చేసిన హాస్పటల్ CEO డా|| ప్రభాకర రావుగారికి నా అభినందనలు.
మనం అందరము చూశాము కోవిడ్ 2వ దశలో దేశం అంతటా ఆక్సిజన్ కొరతతో ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆక్సిజన్ ట్యాంకర్లను రైళ్ళు మరియు విమానాల ద్వారా తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులలో సైతం మన ఆసుపత్రిలో ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా మనం చూసుకోగలిగాము. అందుకు సిబ్బంది అందరికీ నా అభినందనలు. కోవిడ్ ని ఎదుర్కొనే విషయంలో మన ఆసుపత్రి ఎంతో ముందు చూపుతో వ్యవహరించింది. కోవిడ్ కి సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తూ ఎక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఏమీ జరుగకుండా కోవిడ్ సోకిన సిబ్బందికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ మన ఆసుపత్రిలో చేరిన వందల మందికి తక్కువ ఖర్చులో కోవిడ్ చికిత్సను అందించడం జరిగినది.
ఈ చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ కాని, మందులు కాని, వెంటిలేటర్స్ కాని కొరత రాకుండా చూసుకోవడం జరిగినది. కోవిడ్ కి ఒక ప్రత్యేకమైన వార్డ్ ని కేటాయించి, యితర క్యాన్సర్ రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగినది. ఇంకా ఎంతో ముందు చూపుతో ఎలాంటి యిబ్బందులు తలెత్తకుండా బయటి ఆక్సిజన్ సరఫరాదారుల పైన ఆధారపడకుండా మన క్యాంపస్ లోనే ఆక్సిజనన్ను ఉత్పత్తి చేసే విధంగా ఈ ఆక్సిజన్ జనరేటర్ నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ని నిర్విరామంగా ఉత్పత్తి చేస్తూనే వుంటుంది. ఈ విధంగా ఆధునిక సాంకేతికతను సమకూర్చుకుంటూ అన్ని రకాలుగా సంసిద్ధంగా వున్నాము.
కొత్త కరోన వేరియంటైన ‘ఒమిక్రాన్’ అదృష్టవశాత్తు మనదేశంలోకి యింకా అడుగు పెట్టలేదంటున్నారు. అలాంటిది ఏదైనా వచ్చినా మన ఆసుపత్రి అన్ని రకాలుగా సంసిద్ధంగా వుంది అని తెలిపుటకు సంతోషిస్తున్నాను. మీరందరు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను”.