ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ ఓరుగంటి, వ్యక్తిగత స్వార్థం కోసం సంస్థను ఆగం చేసేవారిని కాకుండా సంస్థ కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేసేవారిని ఎన్నుకోండి అంటున్నారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శ్రీరంగపురానికి చెందిన శ్రీనివాస్ 2007లో అమెరికాకు వచ్చి న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో స్థిరపడ్డారు. 2011 లో మొదలైన తన తానా ప్రయాణం మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు నడుస్తుందన్నారు. తాను నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుండి బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇంతకుముందు తానా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రహణం మొర్రి శస్త్రచికిత్స కమిటీకి సమన్వయకర్తగా సేవలందించారు.
పేదలకు అన్నదాన కార్యక్రమాలు, ఆటిజం బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక సెమినార్లు వంటివి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. తనను గెలిపిస్తే తెలుగు రాష్ట్రాల్లోని వృద్ధ, అనాధాశ్రమాలతో పాటు దీనస్థితిలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు.