ఎన్టీఆర్ కళాకారుడు, కళా కార్మికుడు మరియు స్ఫూర్తి ప్రదాత. వెండితెరపై రారాజుగా, రాజకీయాల్లో మహానాయకుడిగా తెలుగునేలపై ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) పేరు చెరగని సంతకం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సుతో జనహృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయులే.
ప్రజా చైతన్య ప్రస్థానంలో ఆయన స్థానం సుస్థిరం, ఆయన కీర్తి అజరామరం. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచిన నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు అశేష తెలుగు జన సందోహం మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి లో మే 21 ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు.
తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజాసేవ కోసమే రాజకీయ వేదికపై గర్జించిన నాయకుని (NTR) శత జయంతి వేడుక సందర్భంగా తెలుగు వారందరికీ సకుటుంబ సమేతంగా ఆత్మీయ ఆహ్వానం అంటున్నారు నిర్వాహకులు. ఈ ఉత్సవాలకు వేదిక వర్జీనియా (Virginia) లోని డ్యూల్స్ స్పోర్ట్స్ ప్లెక్స్.
ఎన్టీఆర్ అభిమానులు మరియు వాషింగ్టన్ డి.సి. ఎన్నారై తెలుగుదేశం (NRI TDP Washington DC) విభాగం వారు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై, రాష్ట్ర హక్కులపై దశాబ్దకాలంగా తన గళాన్ని ఢమరుకంలా మోగిస్తున్న యువ ప్రజా నాయకుడు, భారత లోక్ సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా గా విచ్చేయనున్నారు.
ఎన్టీఆర్ లెగసీ (NTR Legacy) అందరికీ తెలిసేలా ప్రదర్శించనున్న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలు, విందు భోజనం అందరినీ ఆకట్టుకోనున్నాయి. రెజిస్ట్రేషన్ కొరకు www.NRI2NRI.com/NTR@100Years ని సందర్శించండి.