అమెరికాలోని అలబామా రాష్ట్రం, బర్మింగ్హామ్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని May 20, 2023 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో 65 మంది నిరాశ్రయులకి (హోమ్ లెస్) భోజనాన్ని స్వయంగా వండి వడ్డించారు.
ఎన్టీఆర్ నినాదమైన ఆత్మగౌరవం స్ఫూర్తిగా నిరుపేదలకు భోజనాన్ని పంచటం, వారికి అవసరమైన వస్తు సామాగ్రిని అందించటం అన్నగారికి నిజమైన నివాళిగా భావించి, బర్మింగ్హామ్ తెలుగు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు.
సుమారు 50 మంది వరకు తెలుగు మరియు తమిళ్ వారు, పిల్లలు మహిళలు పాలుగొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిమ్మీ హేల్ మిషన్ చారిటీ (Jimmy Hale Mission charity ) వారు తమ ధన్యవాదాలు తెలియచేశారు.
“దాతల ఉత్సాహం, వేల మైళ్ళ దూరంలో ఉన్నా అమెరికాలో ఉన్న నిరాశ్రయులను ఆదుకోవటం చూస్తుంటే, ఎన్టీఆర్ గొప్పతనం తెలుసుకోవాలి అని ఉత్సాహం కలుగుతుందంటూ, జై ఎన్టీఆర్ నినాదాలు చేసారు”.
వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తి తరతరాలకు, దేశ దేశాలకు వెలుగు నింపుతూనే ఉంటుందన్నారు. పిల్లలు మహిళలు ఉదయం నుంచే ఉత్సాహంగా పాల్గొని వంటలు చేసి స్వయంగా వడ్డించటం చూస్తే ఎన్టీఆర్ క్రమశిక్షణ, మానవతా విలువలు, సమాజమే దేవాలయం నినాదం కళ్ళకు కట్టినట్టుంది అన్నారు.
వాలంటీర్లు అందరూ జై ఎన్టీఆర్ నినాదాలతో అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. నిర్వాహకులు పాలుగొన్న వారందరికి, దాతలకి, ఛారిటీ వారికి, బర్మింగ్హామ్ మేయర్ కి, మీడియా వారికి ధన్యవాదాలు తెలియచేసారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు.