ప్రస్తుతం ప్రపంచమంతా మారుమోగుతున్న మూడక్షరాల పేరు ఎన్టీఆర్ (NTR). నందమూరి తారక రామారావు (NTR) శత జయంతిని పురస్కరించుకొని పార్టీలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంతోపాటు పలు దేశాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో కొన్ని నగరాలలో విజయవంతంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు (Centenary Celebrations) నిర్వహించగా మే 28 వరకు అమెరికాలో మొత్తం కలిపి 50 నగరాలలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా విశ్వనగరం న్యూ యార్క్ లోని టైమ్స్ స్క్వేర్ (Times Square) లో ఎన్టీఆర్ నిలువెత్తు బిల్బోర్డ్ ప్రదర్శించనున్నారు. ఎన్నారై టీడీపీ అమెరికా (NRI TDP USA) ఆధ్వర్యంలో 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో అతిపెద్ద ఎన్టీఆర్ చిత్రమాలిక ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. మే 27 అర్ధరాత్రి నుండి మే 28 (NTR Birthday) అర్ధరాత్రి వరకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఈ ప్రకటన ప్రసారం కానుంది. బహు ప్రాచుర్యం కలిగిన టైమ్స్ స్క్వేర్ లో రోజంతా ప్రకటన అంటే ఖర్చుతో కూడిన విషయమే. అయినప్పటికీ విశ్వవిఖ్యాత, పద్మశ్రీ, నటసార్వభౌమ డా. నందమూరి తారక రామారావు కీర్తిని ప్రపంచమంతా చాటేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
జయరాం కోమటి (Jayaram Komati) గైడెన్స్ లో, ఎన్నారై టీడీపీ సమర్పణలో, విద్య గారపాటి కోఆర్డినేట్ చేసి సెటప్ చేస్తున్నారు. ఈ విషయంలో NRI TDP టీం వర్క్ ని అభినందించాల్సిందే.ఈ సందర్భంగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) అభిమానులు అందరూ మే 27 శనివారం రాత్రి 11:30 కి న్యూ యార్క్ టైం స్క్వేర్ దగ్గిరకు రావలసిందిగా కోరుతున్నారు.