Connect with us

Celebrations

ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు @ Louisville

Published

on

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డాక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లూయిస్ విల్లే మహానగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంచికలపూడి మాట్లాడుతూ.. తెలుగుజాతి చరిత్ర సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన శతజయంతి ఉత్సవాలు అన్ని దేశాల్లో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణం. ఐదు దశాబ్దాలు సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో తెలుగువారి ఆశలను, ఆశయాలను ఎన్టీఆర్ (NTR) బాగా ప్రభావితం చేశారు.

జనం గుండెల్లో దేవుడిలా కొలువై ఉన్నారన్నారు. ఇంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఒక మహాపురుషిడిని కోల్పోవడం దేశానికే తీరని లోటు. ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) కు శతవసంతాల నీరాజనం పలుకుతూ భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోందన్నారు.

రావు కన్నెగంటి మాట్లాడుతూ.. తెలుగువారికి, తెలుగుభాషకు గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడయ్యారు. ఎన్టీఆర్ కాలాన్ని ప్రత్యేక యుగంగా, ఆయనొక యుగపురుషుడిగా తెలుగుసమాజం భావిస్తోంది. అందుకే ఆయన జీవితం అనేక యుగాల వారికి ఆదర్శం. ఆయనది మరణం లేని జననం, మరణించి జీవిస్తున్నారని అన్నారు.

మహేంద్ర సుంకర, నరేష్ బొప్పన, వేణు సబ్బినేని తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected