నారా చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్చనలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును (Nara Chandrababu Naidu) అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాలను భాను ప్రకాష్ మాగులూరి, సుధీర్ కొమ్మి, రాజా రావులపల్లి సమన్వయ పరిచారు. ఉమ్మడి, విభజిత ఆంధ్రాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అరెస్ట్, తదుపరి అవలంబిస్తున్న విధానాలపై ప్రవాస భారతీయులు మండిపడ్డారు. కనీసం ఆయన వయసు, రాష్ట్రం కోసం అందించిన సేవలను చూసైనా నేటి ప్రభుత్వ సంబంధిత శాఖలు, ముఖ్యమంత్రి (Chief Minister) మానవీయతతో ప్రవర్తించాలని, అధికారం శాశ్వతం కాదని.. ఇలాగే చంద్రబాబు ప్రవర్తించి ఉంటే గతంలో జగన్ (YS Jagan Mohan Reddy) పాదయాత్ర కొనసాగేదా అని నిలదీశారు.
కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కుంటున్న చంద్రబాబు గారి పట్ల పాటిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, పలు రాష్ట్రాల్లో ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి ప్రభుత్వం ఓర్చుకోలేక మతి తప్పి పాలనను సాగిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు వారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, అధికార దుర్వినియోగాన్ని గమనిస్తున్నారని.. ఓటు అనే ఆయుధంతో కొద్దినెలల్లో చెంప చెళ్ళు మనిపిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government సైతం చేష్టలుడిగి చోద్యం చూస్తుందని.. ఆంధ్రాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ రాష్ట్రం దేశం లో భాగం కాదా మోడీ గారు అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని సర్వదా నమ్మి పాటించే చంద్రబాబు (Nara Chandrababu Naidu) న్యాయస్థానాలు సాక్షిగా చేస్తున్న ధర్మ పోరాటానికి దైవం కూడా తోడుంటుందని..ఇప్పుడూ, ఎప్పుడూ..మేము సైతం బాబు కోసం అని నినదించారు. ఈ కార్యక్రమంలో రమేష్ గుత్తా, సురేఖ చనుమోలు, భవాని పర్వతనేని, చక్రవర్తి పయ్యావుల, జానకిరామ్ భోగినేని, బాబు వేమన, వీరనారాయణ, రమేష్ అమిర్నేని, వేణు దారపనేని, సతీష్, రేష్, నెహ్రు, అమ్మిరాజు, దుర్గాప్రసాద్ కూచిపూడి తదితరులు పాల్గొన్నారు.