Andhra Pradesh: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో జూమ్ ఆన్లైన్ వేదికగా శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు వివిధ దేశాలలో నివసించే ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MSME, SERP &NRI సాధికారత సంక్షేమ సంబంధాల శాఖ మంత్రివర్యులు గౌ. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారితో వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులను సమన్వయపరుస్తూ ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
వివిధ దేశాలలో నివసించే ప్రవాసాంధ్రుల (NRIs) పరిస్థితులను కష్టనష్టాలను రాష్ట్ర మంత్రివర్యులు తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రవాసీయులకు లభించే వివిధ సౌకర్యాలు అవకాశాల గురించి ప్రపంచ నలుమూలలో ఉండే ప్రవాసాంధ్రులు తెలుసుకొనేందుకు ఈ వేదిక ఒక వారధిగా నిలిచి, అందరి ప్రశంసలు అందుకుంది.
6 ఖండాల నుండి పాల్గొన్న 40 దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి ఆదేశాలతో తెలుగు ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రవాసీయులతో సంబంధాలు మెరుగుపరిచేందుకే ఈ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.
అన్ని దేశాల తెలుగు సంస్థలను కలుపుతూ ఒక సమూహం ఏర్పాటు చేయాలని AP NRTS నుండి ప్రతి జిల్లాలోనూ కలెక్టరేటుకు అనుబంధంగా ఎన్నారైలకు సహకారం అందించేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున అధికారులను నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశాలలో తెలుగు భాషా బోధన అభివృద్ధికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. వివిధ దేశాల వారు విన్నవించిన సమస్యలను విని స్పందించారు.
APNRTS సంస్థ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వచ్చి ప్రత్యేక సహకారాన్ని అందించారు. సంస్థ అధికారులు సీఈఓ పి హేమలతా రాణి (Hemalatha Rani) గారు, డిప్యూటీ డైరెక్టర్ కరీమ్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మావతి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రులకు లభించే సౌకర్యాలు, కీలకమైన కష్ట సమయాలలో అందించబడే సహాయం మొదలైన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ (Kavuturu Ratna Kumar) మాట్లాడుతూ “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు సంస్థలన్నీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఒక సమన్వయంతో పని చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని” తెలిపారు.
తమ అభ్యర్థనను అంగీకరించి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారికి, సహకరించిన ఏపీఎన్ఆర్టీ శాఖ అధికారులకి, హాజరైన అన్ని దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాధిక మంగిపూడి (Radhika Mangipudi) ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా మరియు వ్యాఖ్యాతగా వ్యవహరించగా , ఖతార్ నుండి విక్రమ్ సుఖవాసి , నార్వే నుండి డా. వెంకట్ తరిగోపుల, యుగాండా నుండి డా. బూరుగుపల్లి వ్యాసకృష్ణ, దక్షిణాఫ్రికా నుండి విక్రమ్ పెట్లూరు సహసమన్వయకర్తలుగా సహకరించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఖండం నుండి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలు; తూర్పు ఆసియా ప్రాంతం నుండి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్రూనై, ఇండోనేషియా, వియత్నాం హాంకాంగ్; జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలు; మధ్యప్రాచ్య ప్రాంతం నుండి కువైట్, ఖతార్, బహరేన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్ దేశాలు; మారిషస్; ఐరోపాఖండం నుండి నార్వే, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, పోలాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, హంగేరీ దేశాలు; ఆఫ్రికా ఖండం నుండి దక్షిణాఫ్రికా, యుగాండా, రువాండా, ఇథియోపియా, టాంజేనియా, జాంబియా, మాలావి, మొజాంబిక్, బొత్సవానా, కెన్యా, నైజీరియా దేశాలు; దక్షిణ అమెరికా ఖండం నుండి పెరూ; ఉత్తర అమెరికా ఖండం నుండి కెనడా & అమెరికా సంయుక్త రాష్ట్రాలు నుండి సుమారుగా 55 తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సూచనలను సమస్యలను, నేరుగా పంచుకున్నారు.
అందరూ ఈ విధంగా ఎన్నారై (NRI) సంబంధాల శాఖామాత్యులతో నేరుగా సంప్రదించే విధంగా ఇటువంటి ఒక ఆన్లైన్ వేదికలో పాల్గొనే అవకాశం కలిగడం తొలిసారి అని అభిప్రాయపడుతూ హర్షం వ్యక్తం చేశారు.సింగపూర్ సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, రాంబాబు పాతూరి, సుబ్బు వి పాలకుర్తి నిర్వహణా సహకారం అందించగా గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.