ప్రముఖ ఎన్నారై, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జయరాం కోమటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ ప్రోద్భలంతో జరిగిన దాడిని ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్తో చేసిన దాడులని ఆరోపించారు. దాడులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినా ఎక్కడా పోలీసులు వచ్చి ఆపకపోవడం హేయమన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ దాడుల వెనుక ఎవరున్నది, వారి ఉద్దేశాలు ఏంటనేది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారని కోమటి జయరాం అన్నారు.
వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘రాజధాని అమరావతి, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం సహా మొత్తం 13 జిల్లాల్లోని ప్రధాన టీడీపీ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. పాలన చేతకాక వాటిపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక వైసీపీ నేతలు గూండాగిరి చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల పట్టుబడుతున్న గంజాయి వాహనాలు ఏపీ నుంచి వచ్చినవే అని ఆధారాలతో వార్తలు వస్తుంటే దానిని ప్రశ్నించడం తెలుగుదేశం తప్పా? దానికే దాడులు చేస్తారా? మీరు ఏం చేసినా ప్రతిపక్షాలు, ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చోవాలా?’ అని కోమటి ప్రశ్నించారు.
రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, పరిశ్రమలు పోతున్నాయని, కొత్తవి రావట్లేదని, దీనివల్ల యువతకు ఉపాధి కరువైందని అన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక, నిరుద్యోగ సంక్షోభంతో విలవిల్లాడుతోందని బాధపడ్డారు. ఇలాంటి సమయంలో తాజా ఘటనలు రాష్ట్రాన్ని ఎటుతీసుకెళ్తాయో, ఇంకెంత నాశనం చేస్తాయో అర్థం కావడం లేదని అన్నారు. ‘మీకు టైం దగ్గరపడుతోంది. మీ రౌడీయిజం, అరాచకాలను మీరే ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ మూకలను ఆపడానికి స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం’ అని కోమటి జయరాం పేర్కొన్నారు.