అక్టోబర్ 12, 2021: తెలుగుదేశం పార్టీ ఎన్నారై సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అమెరికా, యూరప్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ అమెరికా, గల్ఫ్ తదితర దేశాలలో ఎన్నారై కౌన్సిల్ సభ్యులను నియమించారు. ప్రాంతాల వారీగా కౌన్సిల్ మెంబర్ల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రత్యేకంగా అమెరికా ఎన్నారై కమిటీ విషయానికొస్తే మన్నవ మోహన్ కృష్ణ ని న్యూ జెర్సీ ప్రాంతానికి కౌన్సిల్ మెంబర్ గా అందులోనూ 26 మందిలో ఒకడిగా, వేమన సతీష్ ని గ్రేటర్ వాషింగ్టన్ ప్రాంతానికి కౌన్సిల్ మెంబర్ గా అందులోనూ 16 మందిలో ఒకడిగా నియమించారు. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీయెన్ఆర్టి ప్రెసిడెంట్ గా చేసిన వేమూరు రవి, స్పెషల్ రిప్రజెంటేటివ్ గా చేసిన కోమటి జయరాం పేర్లు అసలే మిస్సింగ్.
ఇకపోతే సౌత్ఈస్ట్ లో మంచి పట్టున్న అట్లాంటా ప్రాంతానికేమో ముగ్గురితో సరిపెట్టారు. కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లోనేమో చేంతాడు అంత పొడుగు లిస్ట్ పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో బ్లడ్ పెట్టి పనిచేసే కార్యకర్తలను వదిలి, కొందరు ఎన్నారై లీడర్స్ గ్రూపిజం కారణంగా అనర్హులను అందలం ఎక్కించారని వాదన. తెలుగుదేశం తరుపున సీట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తామంటున్న మన్నవ, వేమన లను సిటీ కౌన్సిల్ మెంబెర్స్ గా పరిమితం చేయడమేంటో, వేమూరు, కోమటి ల పేర్లు మిస్సింగేంటో, పట్టున్న ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురితో సరిపెట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేలా చేయడమేంటో ఆ దేవుడికే ఎరుక!
కాకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే మకాంవేసి ఉన్న ఎన్నారై నేత చక్రం తిప్పడంవల్లే ఈ పరిస్థితి అని కొందరు హార్డ్కోర్ ఎన్నారై తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ రిలీజ్ ప్రకారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత హోంవర్క్ చేసి, అందరిని సంప్రదించి పనిచేసే వారికి పదవులిచ్చి, షో ఆఫ్ చేసేవాళ్ళని పక్కనపెడితే బాగుండేదేమో అంటున్నారు కొందరు. ఎంతైనా డిమాండ్ ఉన్న పార్టీలో ఇటువంటి ఆటుపోటులు సహజమంటున్నారు మరికొంతమంది.