Connect with us

News

Washington DC: ప్రపంచ స్నేహితుల దినోత్సవం, ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం

Published

on

రాష్ట్రంలో పాలకపక్షం గద్దె దిగితేనే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల, మన్నవ అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మైనేని రాంప్రసాద్, తానా వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, కొమ్మి సుబ్బయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పరస్పర స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతి కుంటు పడింది. రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి ఆనవాలు లేని దిశగా సాగుతుంది. దానికి అనుగుణంగా ప్రవాసాంధ్రులు తమవంతు సహాయసహకారాలు మాతృభూమికి అందించాలి. గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో పలు రంగాలు కుదేలయ్యాయి. పధకాల పేరిట జరుగుతున్న పాలన పూర్తిగా అసమంజసం. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సమర్ధ నాయకత్వ లేమి, అవివేక, కక్ష పూరిత నిర్ణయాల వలన రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైంది. నాలుగేళ్లలో రూ.11.30 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ భారం ప్రజలపై పడింది. ప్రవాసాంధ్రులు కళ్లు తెరవకపోతే అక్కడ మీ ఆస్తులకు, ఆప్తులకు కూడా రక్షణ ఉండదు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం కలవడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన నరేన్ కొడాలిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

తానా నూతన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి మాట్లాడుతూ.. ఏ దేశమేగినా, ఏ రంగంలో కాలిడినా తెలుగువారు, భారతీయులంతా కష్టించే తత్వంతో ముందుకెళ్తున్నారని, నూతన ప్రమాణాలతో తన కార్యాచరణ ఇక ముందు సాగుతుందని తెలిపారు.

భాను మాగులూరి మాట్లాడుతూ.. మాతృభాష, మాతృభూమి మన భాద్యత .. అందుకోసం ప్రవాసాంధ్రులు తమవంతు పాత్రను, కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. శక్తి మేరకు విద్యా రంగంలో ప్రతిభ గల విద్యార్థులకు చేయుట నందించాలని, తెలుగు వారందరూ ఈనాడు ప్రపంచ వేదికపై తమ మేధో శక్తితో సత్తా చాటుతూ, వివిధ రంగాల్లో నూతన ఒరవడి సృష్టిస్తూ, ప్రగతి బాటలో దూసుకెళ్ళటం మనందరికీ గర్వ కారణమన్నారు..

మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే దేశంలోనే ముందువరుసలో ఉండేదన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముపాళ్ల నాగేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, నరేన్ కొడాలిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, రామ్ చౌదరి ఉప్పుటూరి, కిషోర్ కంచర్ల, ఆకాష్ వలేటి, రవి ఐతా, యండమూరి నాగేశ్వరరావు, పాకాలపాటి కృష్ణయ్య, బండ మల్లారెడ్డి, రమేష్ అవిరినేని, సీతారామారావు, ప్రసాద్ పారుపల్లి మరియు ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected