ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association) ‘నాటా’ మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్ డల్లాస్ లో ఘనంగా నిర్వహించారు. వచ్చే 2023 జూన్ 30 నుండి జులై 2 వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించనున్న నాటా మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్ లో భాగంగా బోర్డ్ మీటింగ్, డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ పరిశీలన, ఫండ్రైజర్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి (Dr. Sridhar Reddy Korsapati) అధ్యక్షతన బోర్డ్ మీటింగ్ లో మహాసభల నిర్వహణ ప్రణాళికలు, ఆర్ధిక విషయాలకు సంబంధించి చర్చించారు. అలాగే డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ ని సందర్శించి, ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు రచించారు.
గత వారాంతం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుండి నాటా కార్యవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు వివిధ ప్రతినిధులు హాజరయ్యారు. సాయంత్రం జరిగిన ఫండ్రైజర్ కార్యక్రమంలో సుమారు 700 మంది పాల్గొని విజయవంతం చేశారు.
మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో 2.7 మిలియన్ డాలర్ల విరాళాలు రైజ్ చేశారు. సుమారు 300 మంది దాతలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఈ రేంజ్ లో ఉంటే ఇక అసలు కన్వెన్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని నాటా సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత, నాటా సంస్థ స్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ ఎమెరిటస్ మరియు అన్ని విషయాల్లో ముందుండి నడిపించే డా. ప్రేమ్ సాగర్ రెడ్డి (Dr. Prem Sagar Reddy) తదితరులను ఘనంగా సన్మానించారు.చక్కని ఏర్పాట్లతో గ్రాండ్ గా అన్ని విషయాల్లోనూ ఎక్కడా రాజీ లేకుండా నాటా మహాసభలను నిర్వహించనున్నట్టు తెలిసింది.
టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ నగర నడిబొడ్డున అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ (Dallas Convention Center) లో డల్లాస్ తెలుగు కమ్యూనిటీ సహకారంతోపాటు అమెరికా నలుమూలలా ఉన్న దాతలు, సభ్యుల తోడ్పాటుతో డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ మహాసభలు నాటా చరిత్రలో నిలిచిపోనున్నాయి.
మరిన్ని వివరాలకు ఎప్పటికప్పుడు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ కన్వెన్షన్ వెబ్సైట్ http://www.nataconventions.org/ ని సందర్శించండి.