మూడు రోజులపాటు సాగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కన్వెన్షన్ విజయవంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. చివరి రోజైన జులై 9 ఆదివారం రాత్రి నూతన అధ్యక్షునిగా నిరంజన్ శృంగవరపు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
తానా కన్వెన్షన్ సభావేదికపై ఔట్ గోయింగ్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు సభాముఖంగా నిరంజన్ శృంగవరపు ని వేదిక పైకి ఆహ్వానించి తానా అధ్యక్షునిగా తనకి ఈరోజు చివరిరోజని, రేపటి నుండి అనగా జులై 10 నుండి నిరంజన్ శృంగవరపు అధ్యక్షునిగా కొనసాగుతారని అన్నారు.
కుటుంబ సమేతంగా వేదిక పైకి విచ్చేసిన నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ముందుగా తన తల్లితండ్రులను తలచుకున్నారు. తానా లీడర్షిప్ అందరికీ, కన్వెన్షన్ కి విచ్చేసిన అతిరథమహారథులకు, అలాగేతనను తానా అధ్యక్షునిగా ఎన్నుకున్న తానా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది తన అదృష్టమని, అందరినీ కలుపుకొని పోతూ తానా ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. కర్నూలు (Kurnool) జిల్లా, రాజానగరం గ్రామ రైతు కుటుంబానికి చెందిన నిరంజన్ (Niranjan Srungavarapu) 2000 సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నారు.
పలు విధాలుగా ఆర్ధికంగా మరియు హార్దికంగా రెండు తెలుగు రాష్ట్రాలు, అమెరికాలో సేవలందించిన నిరంజన్ శృంగవరపు ఇంతకు ముందు తానా ఫౌండేషన్ ట్రస్టీగా మరియు తానా ఫౌండేషన్ ఛైర్మన్ గా సేవలందించి, 2021 తానా ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి గెలిచారు.
ఇప్పుడు 2023 లో తానా అధ్యక్షులుగా నిరంజన్ శృంగవరపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు తానా (TANA) నాయకులు, సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ నిరంజన్ (Niranjan Srungavarapu) కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.