Connect with us

Training

నాట్స్: ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్, ట్రైన్ ది ట్రైనర్ ఇంపాక్ట్ సదస్సులు విజయవంతం

Published

on

సమాజాన్ని జాగృతం చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి సరైన దిశా నిర్దేశం చేసి, వారిని కార్యరంగంలోకి దించేందుకు ఇంపాక్ట్ సదస్సులు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నిర్వహిస్తోంది. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తెచ్చి వారికి అవసరమైన అత్యంత ప్రభావశీలమైన నైపుణ్యాలను అందించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. భారతదేశ పునర్నిర్మాణంలో యువతను భాగస్వాముల్ని చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ తో కలసి నాట్స్ అమెరికాలో దేశ వ్యాప్తంగా పలునగరాల్లో ఈ సదస్సులను నిర్వహిస్తోంది.

వ్యక్తిత్వ వికాసం, జీవన విలువలు, గొప్ప వక్తలుగా మారడం ఎలా అనే అంశాలపై శిక్షణ ఇవ్వడంలో ఇంపాక్ట్ ఫౌండేషన్‌కు మంచి పేరు ఉంది. ‘ట్రైన్ ది ట్రైనర్’ అనే పేరుతో ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుగుతున్నాయి. యువతను ప్రోత్సహించేలా వారిలో వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక వికాసానికి మధ్య అంతర్గత సంబంధం ఉందని గుర్తించేలా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. అమెరికాలో గత మూడు వారాలుగా నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ ఆన్ లైన్ శిక్షణ తరగతులకు పలు రాష్ట్రాల నుండి దాదాపు నూట యాభై మందికి పైగా యువత హాజరయ్యారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా కాన్సస్ నగరంలో గంపా నాగేశ్వర్ రావు గారు స్వయంగా విచ్చేసి నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ సదస్సు నిర్వహించారు. ఇది స్థానిక తెలుగు యువతను ఉత్తేజ పరిచింది. ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్ ఇదే మన ఇంపాక్ట్ నినాదం అని గంపా నాగేశ్వర్ రావు గారు తెలిపారు. యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అందుకు కావాల్సిన శిక్షణ ఇంపాక్ట్ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నాట్స్ నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాలను గంపా నాగేశ్వర్ రావు కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వహణకు వెన్ను దన్నుగా నిలచిన ఇంచర్గెస్ బృంద సభ్యులు కె. వేణుగోపాల్, జె. రాజేశ్వరి, వెంకట్ మంత్రి కి అభినందనలు తెలియజేశారు.

యువతలో స్ఫూర్తిని నింపేందుకు గంపా నాగేశ్వర్ రావు గారు చేస్తున్న అవిరళ కృషిని నాట్స్ ప్రశంసించింది. జ్ఞాపికలతో సత్కరించింది. సామాజిక బాధ్యతతో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి వివరించారు. ఇంకా ఈ సదస్సులో నాట్స్ బోర్డు చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ నేషనల్ లీడర్స్ జ్యోతి వనం, రవి గుమ్మడిపూడి, ప్రముఖ ప్రవాసాంధ్ర గాయకులు శ్రీ అమ్ముల విశ్వమోహన్, రమా దేవి, డాక్టర్ ఆరుణ రాయపరెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి, కాన్సస్ చాప్టర్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఇసుకపల్లి, భారతి రెడ్డి, గిరి చుండూరు, కాన్సస్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీదేవి గొబ్బూరి, ఉపాధ్యక్షులు సరిత మద్దూరు, స్థానిక సిలికానాంధ్ర మనబడి కో ఆర్డినేటర్ రత్నేశ్వర మర్రె తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ భారతీ రెడ్డి, స్టాపింగ్ ట్రీ ఐఎన్‌సీ, మంత్రి ఐఎన్‌సీలు ఈ సదస్సులకు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected