నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ‘నాట్స్’ 3 రోజుల అమెరికా తెలుగు సంబరాలు నిన్న మే 26 బాంక్వెట్ డిన్నర్ తో గ్రాండ్ గా మొదలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటలకు నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగువారు, ఇండియా నుంచి వచ్చిన అతిథుల రాకతో వేదిక ప్రాంగణం శోభాయమానంగా తయారయ్యింది.
ముందుగా రెజిస్ట్రేషన్ మరియు తేనీటి విందుతో అందరూ బిజీగా కనిపించారు. అనంతరం మెయిన్ స్టేజీపై జ్యోతి ప్రజ్వలనతో నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నాట్స్ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను వేదికమీదికి ఆహ్వానించి నాట్స్ సావనీర్ ని పెద్దల చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం నాట్స్ గత అధ్యక్షులు శేఖర్ అన్నే మరియు ప్రస్తుత అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి అవ్హానితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాట్స్ చేసిన మరియు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను విశదీకరించారు.
వివిధ రంగాలలో సేవలందించిన వారికి అవార్డ్స్ ప్రధానం చేశారు. అలాగే దాతలను, వివిధ సంస్థలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతలు సాహిత్య వింజమూరి మరియు మధు నెక్కంటి తమ వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసేలా నిర్వహించారు.
విందు భోజనం అందరికీ సరిపడా చక్కగా ఏర్పాట్లు చేశారు. చివరిగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఎలీజియం బ్యాండ్ వారి లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అందరినీ ఆకట్టుకుంది. నాట్స్ నాయకులు మరియు ఆహ్వానితులు సైతం కాలు కదిపి కొన్ని పాటలకు చిందులు వేశారు. దీంతో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చినట్లయింది.
ఈ విషయంలో నాట్స్ సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి మరియు ఛైర్మన్ అరుణ గంటి లతోపాటు నాట్స్ సంబరాల కమిటీల ప్రతినిధులందరినీ ప్రత్యేకంగా అభినందించాలి. ఇతర జాతీయ మరియు స్థానిక తెలుగు సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఈ బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినీ ప్రముఖులు సాయికుమార్, కోదండరామిరెడ్డి. బి.గోపాల్, ఆలీ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, ప్రముఖ దర్శకులు బీవీఎస్ రవి, సినీ దర్శకులు గోపిచంద్ మలినేని, బిగ్ బాస్ ఆర్టిస్టులు హిమజ, శివజ్యోతి పాల్గొన్నవారిలో ఉన్నారు.
అలాగే జోర్ధార్ సుజాత, జబర్థస్త్ రాకేశ్, ముక్కు అవినాశ్, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, నందమూరి సుహాసిని, సత్య మాస్టర్, ప్రముఖ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, నందమూరి సుహాసిని లతోపాటు ఇంకా పలువురు నటీనటులు కూడా పాల్గొన్నారు.