మార్చి 13న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నారీ స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల్లో చైతన్యం నింపేందుకు మహిళాదినోత్సవ వేడుకలలో భాగంగా మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన దిశా నిర్దేశం చేసేలా ఈ వెబినార్ సాగింది. వందలాది మహిళలు ఆన్ లైన్ ద్వారా ఈ ఆన్‌లైన్ వెబినార్‌లో పాల్గొన్నారు.
మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు మూడు విభిన్న రంగాల్లో రాణిస్తున్న ముగ్గురు మహిళలను ఈ వెబినార్‌కు ఆహ్వానించింది. కొత్తగా వ్యాపారంలో రావాలనుకుంటున్న మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన విమెన్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకురాలు, ఆర్గానిక్ సీరియల్ ఎంటర్ ప్రెన్యూర్, మెంటర్ దీప్తి రెడ్డి తన అనుభవాలను వివరించారు. వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులను తట్టుకోవడం అలవాటు చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని దీప్తి రెడ్డి చెప్పుకొచ్చారు.
నావల్ అధికారిగా పనిచేస్తున్న దేవి దొంతినేని మహిళలు ఏనాడూ తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దని ఏదైనా సాధించగలరనే నమ్మకం ఉంటే అదే విజయతీరాలకు చేరుస్తుందని దేవి దొంతినేని తెలిపారు. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయాలనే తపనే తనను ఎంతో మంది పేదలకు కోవిడ్ సమయంలో సాయం అందించేలా చేసిందని ప్రముఖ సంఘ సేవకురాలు నిహారిక రెడ్డి తెలిపారు. ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకునే వారు కచ్చితంగా సాయం చేయడానికి ముందుకొస్తారని ఆమె చెప్పారు.
మహిళల్లో స్ఫూర్తిని నింపిన ఈ కార్యక్రమానికి జయ కల్యాణి వ్యాఖ్యతగా వ్యవహరించారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనే స్ఫూర్తిని నింపడానికే నారీ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ ఛైర్ వుమన్ అరుణ గంటి తెలిపారు. ఈ వెబినార్ నిర్వహణలో జ్యోతి వనం తన వంతు సహకారాన్ని అందించారు. ఈ వెబినార్ మధ్యలో మహిళల డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. అలాగే మహిళలపై చెప్పిన కవిత ఔరా అనిపించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జయశ్రీ పెద్దిభొట్ల, లక్షి బొజ్జ, దీప్తి సూర్యదేవర తదితరులందరికీ నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళల్లో ఈ వెబినార్ ఎంతో స్ఫూర్తిని నింపిందని వెబినార్ లో పాల్గొన్న మహిళలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.