లాస్ ఏంజిల్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో తెలుగు మహిళలు పోటీ పడి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. క్రికెట్‌లో తెలుగు మహిళలకు తిరుగులేదనిపించేలా టోర్నమెంట్ సాగింది.
మొత్తం ఆరు మహిళా జట్లు ఈ లాస్ ఏంజిల్స్ (Los Angeles) టోర్నమెంట్‌లో పోటీ పడ్డాయి. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో ఆర్కాడియా లెజెండ్స్, ఆర్కాడియా వారియర్స్, పింక్ పాంథర్స్ గ్రూప్ బిలో ఇర్విన్ దివాస్, సోకల్ సూపర్ క్వీన్స్, టోరెన్స్ టోర్నడోస్ జట్లు ఉన్నాయి.
జట్లు ఒకదానితో ఒకటి రౌండ్ రాబిన్ (Round Robin) గేమ్‌లు ఆడాయి. చివరకు పింక్ (Pink Panthers) పాంథర్స్, టోరెన్స్ టోర్నడోస్ (Torrance Tornadoes) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం పోటాపోటీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టోరెన్స్ టోర్నాడోస్ జట్టు విజయం సాధించింది.
గత నాలుగు వారాలుగా ప్రాక్టీస్ చేసి రంగంలోకి దిగిన తెలుగు మహిళలు క్రీడా స్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన చేయడం అందరిని ఆకట్టుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా టోర్నమెంట్ నిర్వహించడంలో NATS Los Angeles చాప్టర్ నాయకులు కృషి చేశారు.
ఎల్‌ఏ చాప్టర్ కోఆర్డినేటర్ మనోహర మద్దినేని, జాయింట్ కోఆర్డినేటర్ మురళీ ముద్దెన, స్పోర్ట్స్ చైర్ కిరణ్ ఇమ్మడిశెట్టి, మహిళా సాధికారత చైర్ రాధా తెలగం, ఈవెంట్ కోఆర్డినేషన్ చైర్ బిందు శివకామిశెట్టి, హెల్ప్ లైన్ చైర్ శంకర్ సింగం సెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అరుణ బోయినేని, రిజిస్ట్రేషన్ మెంబర్‌షిప్ చైర్ చంద్ర మోహన్ కుంటుమల్ల ఉన్నారు.
అలాగే నాట్స్ (North America Telugu Society) వాలంటీర్లు తిరుమలేష్ కొర్రంపల్లి, నీలెందు హల్దార్, పరిశీల్, హరి కలవకూరి, వంశీమోహన్ గరికపాటి, నరసింహారావు రవిలిశెట్టి, శ్రీకాంత్ చెరువుతో పాటు పలువురు మహిళా వాలంటీర్లు మరియు చాప్టర్ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాట్స్ (NATS) బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మధు బోడపాటి, స్పోర్ట్స్ నేషనల్ కోఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, వెంకట్ ఆలపాటి, హరి కొంక, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే లాస్ ఏంజిల్స్ చాప్టర్ టీమ్‌కు మద్దతు ఇచ్చారు.
మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన లాస్ ఏంజిల్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ టీంకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti), నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి (Bapu Nuthi) ప్రత్యేక అభినందనలు తెలిపారు.