ప్రముఖ సినీ నటులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి (Krishna) నవంబర్ 15న పరమపదించిన సంగతి తెలిసిందే. 1942 మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం లోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు కృష్ణ జన్మించారు.
సుమారు 340 కి పైగా చిత్రాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమై, 1967 లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా లో కథానాయకుడిగా నటించారు. చివరిగా 2016 లో శ్రీ శ్రీ అనే సినిమాలో నటించారు. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణ మృతితో తెలుగు జాతి మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అట్లాంటా కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నవంబర్ 20 ఆదివారం రోజున సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. స్థానిక పెర్సిస్ రెస్టారెంట్ ఈవెంట్ హాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు వారందరూ హాజరై సంతాపం తెలియజేయవలసిందిగా అట్లాంటా కృష్ణ ఫ్యాన్స్ కోరుతున్నారు.