ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో NRI TDP Tampa నాయకులు, అభిమానులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ పలు నగరాల్లో టీడీపీ సమావేశాల్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మినీ మహానాడు వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా అక్టోబర్ 25 మంగళవారం రోజున NRI TDP Tampa నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రముఖులు శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాగేంద్ర తుమ్మల, మరియు స్వరూప్ అంచె సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పుష్పగుచ్ఛాలతో తెలుగుదేశం పార్టీ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ కి సాదరంగా స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అందరితో కరచాలనం చేస్తూ కలివిడిగా తిరిగారు. ముందుగా ఎన్టీఆర్ (NTR) మరియు హరిక్రిష్ణ (Nandamuri Harikrishna) చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎప్పుడూ అవసరం మేరకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని అందులో తప్పు లేదని, అలా కాకుండా విచ్చలవిడిగా ప్రజలందరూ టాక్సులు ద్వారా కట్టిన డబ్బుని కొంతమందికి మాత్రమే పంచడం వల్ల ఇటు రాష్ట్రాలు, అటు ఇండియా మొత్తంగా అభివృద్ధి చెందడం కష్టమవుతుందన్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్ట్ ఒక గట్టి ఆర్డినెన్స్ పాస్ చేస్తే బాగుంటుందని, దీనికి సంబంధించిన కేసులో ఎన్నారైలు కూడా ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందన్నారు.
అనంతరం ఈ ఆత్మీయ సమావేశ అతిథి వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అణచివేత ధోరణి, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి నోచుకోకపోవడం వంటి పలు విషయాలపై ప్రసంగించారు. సకలశాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ సభలో నవ్వులు పూయించారు. సజ్జల రోజూ కౌంటర్ తెరిచి క్యాష్ ఎలా దండుకుంటున్నారో వివరించారు.
ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని టాంపా నగరంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విరివిగా పాల్గొన్నారు. కొంతమంది తమ ఆలోచనలను పంచుకున్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు రాజేంద్ర ప్రసాద్ సమాధానాలిచ్చారు. వీక్ డేస్ లో బిజీగా ఉన్నప్పటికీ అందరూ పాల్గొనడంతో నిర్వాహకులు ఆహ్వానితులందరినీ అభినందించారు.
కొంతమంది తెలంగాణ (Telangana) వారు కూడా పాల్గొనడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి, దార్శనికత గురించి మాట్లాడడం కొసమెరుపు. వచ్చే ఎన్నికలకు ఎన్నారైలు అందరూ అనుకొని కలిసికట్టుగా వెళ్లి టీడీపీ (TDP) గెలుపుకి దోహదపడదాం అని అభిప్రాయపడ్డారు. చివరిగా డిన్నర్ తో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.