Connect with us

Events

డాలస్ లో అహింస, శాంతి సందేశాలను చాటిన బాపూజీ జయంతి వేడుకలు

Published

on

డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీజీ 153వ జయంతి వేడుకలను వందలాది మంది ప్రవాస భారతీయుల మధ్య అత్యంత కోలాహలం గా మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజిఎంఎన్టి) అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సంస్థ కార్యదర్శి రావు కల్వల స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ఉర్మీట్ సింగ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గాంధీ జయంతి వేడుకలలో ఎప్పటిలాగానే “గాంధీ శాంతి నడక” కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు.

ఎంజిఎంఎన్టి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీ జయంతి రోజును ప్రతి సంవత్సరం “అంతర్జాతీయ అహింసా దినం” గా పాటించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం అంటే విశ్వ మానవాళి మొత్తం ప్రపంచ శాంతి కాముకుడైన మహాత్మా గాంధీకి ఘన నివాళి ఘటించినట్లేనని అన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ నగర్ కౌన్సిల్ సభ్యుడు మార్క్ జేస్కి ను, ఇర్వింగ్ నగర పోలీస్ చీఫ్ డెరెక్ మిల్లర్ ను డా. తోటకూర సభకు పరిచయం చేశారు. వీరిరువురు తమ సందేశంలో ప్రవాస భారతీయులు నగర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ అహింస, శాంతి సందేశాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయునికి ఘన నివాళులు అర్పించే అవకాశం రావడం సంతోషం అని అన్నారు.

పోలీస్ చీఫ్ శాంతి నడకను ప్రారంభించే ముందు ఎంజిఎంఎన్టి బోర్డు సభ్యులు, అతిథులు తెల్లటి పావురాలను శాంతికి సంకేతంగా ప్రేక్షకుల కేరింతల మధ్య గాలిలోకి వదిలారు. తెల్లటి టీ షర్ట్స్ ధరించిన వివిధ వయస్సులలో ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ బాపూజీకి పుష్పాంజలి ఘటించి 18 ఎకరాల సువిశాల మైన పార్క్ లో, అత్యంత హుషారుగా నడకలో పాల్గొనడం చూడ ముచ్చటైన దృశ్యం. అల్పాహరంతో సహా చక్కని ఏర్పాట్లు చేసిన కార్యవర్గాన్ని ఆహుతులందరూ మెచ్చుకున్నారు. ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తో సహా బోర్డు సభ్యులు రావు కల్వల, ఉర్మీట్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, ఇందు మందాడి మరియు తైయాబ్ కుండవాలా, పియూష్ పటేల్, షబ్నం మొద్గిల్, రాజీవ్ కామత్, శైలేష్ షా, చంద్రిక, హేతల్ షా, సాంటే చారి, పులిగండ్ల విశ్వనాధం, సత్యన్ కళ్యాణ్ దుర్గ లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అక్టోబర్ 2 సాయంత్రం ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్య అతిథి గా పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీం మహాజన్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా బాపూజీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, బాపూజీ సిద్ధాంతాలు సర్వత్రా. సదా ఆచరణ యోగ్యమని పలికారు. ప్రత్యేక అతిథి గా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్తోఫెర్ మాట్లాడుతూ తమ నగరంలో అమెరికాలోనే అతి పెద్దదైన గాంధీ స్మారక స్థలిని ప్రవాస భారతీయులు నిర్మించడం తమకెంతో గర్వకారణమని వారి ఐక్యత, భావితరాలకు తమ సంస్కృతిని అందించే క్రమంలో వారు చూపిస్తున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయమైనదని అంటూ ఇర్వింగ్ నగరం తరపున అక్టోబర్ 2ను “గాంధీ డే” గా ప్రకటిస్తూ జారీ చేసిన అధికారిక ధృవపత్రాన్ని ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరకు మరియు వారి బోర్డు సభ్యులకు అందజేశారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 250 మందికి పైగా చిన్నారులు, వివిధ సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో – అమృతవర్షిని అకాడమీ, ఆలాప్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్, ఆషా కీర్తి మ్యూజిక్ స్టూడెంట్స్, స్వరస్వాతి సింగింగ్ గ్రూప్, ప్రజన్ అండ్ టీం, శివం డోల తాష పాతక్, డాలస్ పరాయి కుజ్హు,, రాగలీన డాన్స్ అకాడమీ, ఎల్లోరా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నృత్యశక్తి డాన్స్ అకాడమీ, ఆరాధనా డాన్స్ స్కూల్, ఉత్కలా అకాడమీ, రాగమయూరి, దశావతార్ డాన్స్ స్కూల్, కథక్ రిథమ్, నావ్స్ డాన్స్ స్టూడియో మొదలైన సంస్థలనుండి యువతీయువకులు పాల్గొని కనువిందు చేశారు. ఈ సంగీత, నృత్య ప్రదర్శనలన్నీ దేశభక్తి ప్రధానంగా ఉండడం ఒక ప్రత్యేకత.

నాలుగున్నర గంటల పాటు చాలా ఆహ్లాదకరంగా సాగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ‘రేడియో సురభి’ జట్టు సభ్యులు రాజేశ్వరి ఉదయగిరి, రవి తూపురాని, అంబా లక్ష్మి, స్పూరిత మైలవరపు, మైత్రేయి మియాపురం, వేణు చెరుకుపల్లి, శివ దేశరాజుల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభావంతంగా సాగాయి. ఎంజిఎంఎన్టి ఛైర్మన్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు మురళి వెన్నం, రన్నా జాని, ఉర్మీట్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, ఇందు మందాడి మరియు రామ్కి చేబ్రోలు, షబ్నం మొద్గిల్, బి.ఎన్, శైలేష్ షా, గోపాల్ పోనంగి, ములుకుట్ల వెంకట్, సాంటే చారి తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వదాన్యులుగా వ్యవహరించిన ఒమేగా ట్రావెల్స్, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన సురభి రేడియో వారికి, పాల్గొన్న వివిధ సంస్థలకు, చిన్నారులకు, తల్లిదండ్రులకు, అతిథులకు ఐఏఎన్టి బోర్డు ఛైర్మన్ సల్మాన్ ఫర్షోరి కృతజ్ఞతలను తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected