స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. జనవరి 8న లతా మంగేష్కర్‌కు కరోనా వైరస్ రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్చారు. సుమారు నెల రోజుల పాటు పోరాడిన 92 ఏళ్ల లతా మంగేష్కర్ చివరకు ఈరోజు పరమపదించారు. ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు.
లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, 1929 న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గోమంతక్ మరాఠా కుటుంబంలో జన్మించారు. లతా మంగేష్కర్ చిన్ననాటి పేరు హేమ. అయితే కొంతకాలం తర్వాత ఆమె పేరును తల్లిదండ్రులు లతగా మార్చారు. లతా మంగేష్కర్ వారి ఇంటిలో మొదటి సంతానం. మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ లతా మంగేష్కర్‌కు తోబుట్టువులు.
లతా మంగేష్కర్ ప్రపంచంలోని 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు. 1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదైంది. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, 2008లో భారతదేశ స్వాతంత్య్ర 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో లతను సన్మానించారు.
6 దశాబ్దాల పాటు భారతీయ చిత్రసీమలో తన గాత్ర మాయాజాలాన్ని వ్యాపింపజేసిన లతా మంగేష్కర్ చాలా సాదాసీదాగా, ప్రశాంతంగా కనిపించేవారు. సచిన్ టెండూల్కర్ తన తల్లిగా భావిస్తానని అంటుంటారు.