. గర్భ గుడిలో భక్తులకు పునఃదర్శనం ప్రారంభం . కన్నుల పండుగలా కుంభాభిషేకం . మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు . చోళ రాజులు, విజయనగర రాజ వంశీయుల తర్వాత దక్కిన పవిత్రమైన అవకాశం . శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా కుటుంబాల పూర్వజన్మ సుకృతమే . చరిత్రలో నిలిచిన వైనం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం దాతలు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా 10 కోట్ల రూపాయల దాతృత్వంతో పునర్నిర్మాణం గావించిన సంగతి తెలిసిందే. పునర్నిర్మాణం అనంతరం చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకంతో ఈరోజు ఆగష్టు 21న భక్తులకు పునఃదర్శనం ప్రారంభించారు.
చోళ రాజులు, విజయనగర రాజ వంశీయుల తర్వాత వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఈ పవిత్రమైన అవకాశం దక్కడం శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా కుటుంబాల పూర్వజన్మ సుకృతమే. దైవాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదులే అంటారు ఇందుకేనేమో.
ఎన్నోసార్లు తలపెట్టినప్పటికీ చివరగా ఇప్పుడు పునర్నిర్మాణానికి నోచుకోవడంతో కాణిపాకం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 15 నుండి గత 6 రోజులుగా నిర్వహిస్తున్న చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం 7వ రోజు, చివరి రోజు అయినటువంటి ఆగష్టు 21న అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తిరుపతి, చెన్నై, బెంగుళూరు నుండి విచ్చేసిన సుమారు 100 మంది వేద పండితుల ఆధ్వర్యంలో వారం రోజులపాటు కన్నుల పండుగలా జరిగిన ఈ మహా కుంభాభిషేకం చివరి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, స్థానిక శాసన సభ్యులు ఎమ్మెస్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, రాజగోపురం, పశ్చిమ రాజగోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజస్తంభమునకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు రాబోయే వెయ్యి సంవత్సరాలపాటు చెక్కు చెదర కుండా కట్టిన నూతన గర్భ గుడిలో ఆ గణేశుని నామ స్మరణం చేసుకుంటూ దర్శనం చేసుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణధికార సురేష్ బాబు, ఆలయ పునర్నిర్మాణ దాతలు రవి ఐకా, శ్రీనివాస్ గుత్తికొండ మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఆలయ ఉభయదారులు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.