ప్రముఖ ప్రవాసులు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా దాతృత్వంతో కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని పునర్నిర్మాణం గావించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆగష్టు 4 న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించిన విషయం కూడా విదితమే.
భక్తులకు పునఃదర్శనం అందించేలా ఆగష్టు 15 నుండి ఆగష్టు 21 వరకు తలపెట్టిన చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భారత స్వాతంత్ర దినోత్సవమైన ఈరోజు మొదటి రోజు. కావున సాయంత్రం 5 గంటల నుండి వేద పండితుల ఆధ్వర్యంలో అగ్ని మథనము తదితర పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పటిష్ఠమైన ఏర్పాట్ల నడుమ ముందుగా శివాలయం నుంచి పూజా సామగ్రితో ఆలయంలోకి ప్రవేశించి గోపూజ, వేద స్వస్తి, గణపతి పూజ, రక్షాబంధనం, వాస్తు శాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన వంటి పూజలను నిర్వహించారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కొలిచారు.
భక్తి పారవస్యాలతో నిండిన ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ పునర్నిర్మాణ దాతలు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా, వారి కుటుంబ సభ్యులు, అర్చకులు మరియు భారతదేశంలోని పలు ప్రసిద్ధ దేవస్థానాల నుంచి విచ్చేసిన వేద పండితులు పాల్గొన్నారు.