Connect with us

Athletes

మొట్టమొదటి తెలుగువానిగా & 48వ భారతీయునిగా చరిత్ర పుటల కెక్కిన మారథానర్ జయప్రకాశ్ ఇంజపూరి

Published

on

అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తున్న జయప్రకాశ్ ఇంజపూరి చరిత్ర పుటల కెక్కారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎబ్బాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ సిక్స్ స్టార్ ఫినిషర్ మెడల్ గెలుచుకున్నారు. బెర్లిన్, బోస్టన్, చికాగో, లండన్, న్యూయార్క్ మరియు టోక్యో లో నిర్వహించిన 6 మారథాన్లు విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక పతకం సాధించారు.

గత ఏప్రిల్ లో పూర్తిచేసిన బోస్టన్ మారథాన్ తో ఎబ్బాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ సిక్స్ స్టార్ ఫినిషర్ మెడల్ గెలుచుకున్న మొట్టమొదటి తెలుగువానిగా, 48వ భారతీయునిగా మరియు ప్రపంచంలో 251వ వానిగా జయప్రకాశ్ ఇంజపూరి చరిత్ర పుటల కెక్కారు. మారథాన్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకరకంగా సుదూర పరుగు పందెం లాంటిది.

ప్రతి మారథాన్ లో 26 మైళ్ళ 385 గజాల దూరం పరిగెత్తాలి. అలాంటి 6 మారథాన్లు పూర్తిచేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పతకం సాధించిన జయప్రకాశ్ ఇంజపూరి తెలంగాణ వాసి. ఖమ్మం జిల్లా ఎల్లందు గ్రామానికి చెందిన జయప్రకాశ్ చిన్నప్పుడే ఇంటికి పాఠశాలకి మధ్య పరిగెత్తుతూ పరుగు పందాలపై మక్కువ పెంచుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 దేశాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 800 మారథాన్లు నిర్వహిస్తుంటారు. కానీ ఎబ్బాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైనది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించడం కూడా అంత సులువేమీ కాదు. లాభాపేక్షలేని సంస్థలకు ధన సహాయం చేయాలి. సన్నాహక ప్రక్రియలో భాగంగా ఆరోగ్యపరంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.

1998 లో అమెరికా రావడంతో తన మక్కువని నిజం చేసుకునేందుకు బీజం పడింది. న్యూయార్క్ రోడ్ రన్నర్ సంస్థలో సభ్యునిగా చేరి, 8 సంవత్సరాల పాటు తిరస్కరణకు గురైనప్పటికీ, చివరికి 2016 లో టీం ఫర్ కిడ్స్ ఛారిటీ వర్క్ ద్వారా తన మొట్టమొదటి మారథాన్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు.

నవంబర్ 6, 2016 న ఎబ్బాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ వారి న్యూయార్క్ మారథాన్లో 6 గంటలపాటు పరిగెత్తి సెంట్రల్ పార్క్ లో విజయవంతంగా పూర్తి చేసి తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశారు. అప్పుడే మిగతా 5 మారథాన్లు కూడా పూర్తి చేసి ఎలాగైనా సిక్స్ స్టార్ ఫినిషర్ మెడల్ సాధించాలనే ధృడ సంకల్పానికొచ్చారు.

అనుకున్నదే తడవుగా ఎన్నో వ్యయ ప్రయాసల నోర్చి 2017 లో చికాగో, 2018 లో టోక్యో మరియు బెర్లిన్, 2021 లో లండన్ మారథాన్లు పూర్తి చేశారు. గత ఏప్రిల్ 18, 2022 న చివరిది మరియు ఆరవది అయినటువంటి బోస్టన్ మారథాన్ కూడా పూర్తి చేసి ప్రతిష్టాత్మక పతకం సాధించడమే కాకుండా తన చిన్నప్పటి కలను సాకారం చేసుకున్నారు. 3 ఖండాలలో 5 సంవత్సరాలపాటు 6 ప్రపంచ ప్రఖ్యాత మారథాన్లను పూర్తిచేయడం అభినందనీయం.

వృత్తి రీత్యా ఐటీ లో పెద్ద బహుళ జాతీయ సంస్థలో పనిచేస్తున్న జయప్రకాశ్, ప్రస్తుతం 51 సంవత్సరాల చరిత్ర కలిగిన న్యూయార్క్ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యనే స్పోర్ట్స్ కేటగిరీలో ప్రముఖ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అందించే జాతీయ స్థాయి అవార్డుకి ఎంపికయ్యారు.

తన ఈ మారథాన్ ప్రయాణంలో ఎందరో తోడ్పడ్డారన్నారు జయప్రకాశ్. ముఖ్యంగా తండ్రి రాజేశ్వర్ రావు ఇంజపూరి, తల్లి కీ.శే. రాధాబాయి, భార్య కరుణ, కొడుకులు రోహన్, రాహుల్, తోబుట్టువులు రాజమణి, రవి కుమార్, ప్రభాకర్, బావ సారయ్య, వదినలు సంధ్యారాణి, స్వర్ణ లత మరియు ఇతర కుటుంబ సభ్యులు, అలాగే తన ఛారిటీకి సహాయం చేసిన దాతలు, స్నేహితులు మరియు సహచరుల సహకారం మరువలేనిదన్నారు.

మారథాన్లతోపాటు జయప్రకాశ్ టెన్నిస్, బాడ్మింటన్, చదరంగం మరియు క్యారం బోర్డ్ వంటి ఆటల్లో కూడా నిష్ట్నాతులు. ఇప్పటివరకు చాలా యూఎస్ క్యారం బోర్డ్ ఛాంపియన్షిప్ లలో ఆడారు. మారథాన్లను కూడా ఇంక ఆపను, ఇదంతా ఆరంభం మాత్రమే, ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను. అలాగే లాభాపేక్ష లేకుండా తన ఛారిటీ వర్క్ నిరంతరం చేస్తూనే ఉంటాను అంటున్నారు మారథానర్ జయప్రకాశ్ ఇంజపూరి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected