• ప్రతిసారీ కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారు
• రాష్ట్ర భవిష్యత్తును పార్లమెంటులో తాకట్టుపెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి
• ముఖ్యమంత్రివి ఓటు బ్యాంకు రాజకీయాలు
• బటన్ నొక్కడానికి రోబోలు సరిపోతాయి
• సీఎంకు మానవత్వం ఉంటే విదేశాల్లో ఇబ్బంది పడుతున్న కాపు విద్యార్థుల్ని ఆదుకోవాలి
కాపు నేస్తం అనే ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడిన భాష అత్యంత హేయం. కులాలను కలపాల్సిన బాధ్యతలను పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి ఓ దురుద్దేశంతో.. సమాజంలో అలజడి సృష్టించే విధంగా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కులాలను పక్కనపెట్టి, సమాజ అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాం అని ప్రతి సందర్భంలోనూ పిలుపునిచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడటం బాధాకరం.
• పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక…
వరదల్లో ప్రజలుపడుతున్న బాధలను పక్కనపెట్టి బాధ్యత విస్మరించిన పాలకుడు జగన్ రెడ్డి. కాపు నేస్తం పథకం బటన్ నొక్కిన ముఖ్యమంత్రి 3.38 లక్షల మందికి లబ్ధి కలిగిందని చెబుతున్నారు. ప్రభుత్వం వివిధ నిబంధనల పేరుతో ఎంతమందికి పథకం దూరం చేసిందో కూడా చెప్పాలి. రేషన్ కార్డులు తీసేసి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, ఏసీ, టీవీ, కారు, స్థలం ఉందంటూ రకరకాల కారణాలు చూపుతూ ఎంతో మందికి పథకం ఫలాలు ప్రభుత్వం దూరం చేసింది. ఓ సామాజిక వర్గ ఓట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నాయనే అక్కసుతో ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొలేని ముఖ్యమంత్రి కేవలం వ్యక్తిగత విమర్శలు చేసి ఆనందం పొందుతున్నారు. పార్లమెంటులో రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా తాకట్టు పెట్టిన వ్యక్తి శ్రీ జగన్ రెడ్డి. పార్లమెంటులో ఏ బిల్లుకైనా, ఏ సందర్భం వచ్చినా అడిగినా, అడగకపోయినా కేంద్రానికి వైసీపీ ఎంపీలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ఇది ఎవరి లబ్ధి కోసం.. ఎవరికి మంచి చేయడం కోసమో వైసీపీ ఎంపీలు చెప్పాలి. ఎంతకు అమ్మడుపోయి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారో సమాధానం ఇవ్వాలి.
• ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?
ప్రజలకు మేలు చేయమంటే ప్రతిసారీ బటన్ నొక్కాను.. బటన్ నొక్కాను అని ముఖ్యమంత్రి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రోబోలు చేసే పని అది. దాని కోసమా ప్రజలు మంచి మెజారిటీతో మిమ్మిల్ని ఎన్నుకున్నది..? మానవత్వంతో స్పందించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సింది పోయి… బటన్ నొక్కి ముసిముసి నవ్వులు చిందిస్తూ, చప్పట్లు కొట్టుకోవడం పాలన కాదు. అసలు ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?
అధికారంలో లేకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు రావడం మానవత్వం. యువతకు దారి చూపాలని ఆలోచించడం మానవత్వం. కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించేలా, వారి సమస్యలను సావధానంగా వినడం మానవత్వం. ఎలాంటి మానవత్వం లేకుండా పాలన చేసే మీరు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సిగ్గుచేటు. మీ బటన్ నొక్కడం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు..? మీరు ఇచ్చిన జాబితాలోనే లొసుగులు కనిపిస్తున్నాయి. జిల్లాలవారీగా కాపు నేస్తం జాబితాలో లెక్కలేనన్ని తప్పలున్నాయి. అర్హులైన ఎంతో మందికి సాయం అందలేదు. నిజంగా ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే పేద కాపు విద్యార్థులు విదేశాల్లో పడుతున్న కష్టాల గురించి ఒకసారి ఆలోచించాలి. సుమారు 1200 మంది విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యకు చదువుల సాయం మధ్యలో ఆగిపోయి, విదేశాల్లో మగ్గిపోతున్న హృదయవిదారక సంఘటన కోసం మాట్లాడండి. వారి కష్టాలు తీర్చండి. మా పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండని బాధితుల కుటుంబాలు వారి పడుతున్న వేదనను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని ఈ ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడూ కులాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయం తప్ప ముఖ్యమంత్రికి వేరే ఆలోచన లేదు.
• అమలాపురం అల్లర్ల వెనుక ఎవరు ఉన్నది ప్రజలు గమనించారు
అమలాపురం అల్లర్ల వెనుక ఎవరు ఉన్నది రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఎందుకు చిచ్చుపెట్టాలనుకున్నారో తెలుసు. అక్కడే ఎందుకు పదేపదే అలజడులు సృష్టించాలని చూస్తున్నారో ప్రజలకు అర్థం అవుతోంది. అన్ని విషయాలు బయటపడుతున్న వేళ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలోనూ మంత్రులను శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పదేపదే విమర్శలు చేయించి.. మీ అవసరం తీరాక వారిని పక్కకు నెట్టేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీ విలువైన సమయం వృథా చేసుకోకుండా, పాలన మీద దృష్టి పెట్టండి.
జనసేన పార్టీ ఎప్పుడూ కులాలను కలిపేలా, పదిమందికి మేలు జరిగేలా మాత్రమే రాజకీయం చేస్తుంది. కష్టపడి, నిజాయతీగా ప్రజలకు ఉపయోగపడేలా పని చేయడమే జనసేన అంతిమ లక్ష్యం. గోదావరికి వరదలు వచ్చినపుడు మీరు చేసిన సాయం ప్రపంచానికి తెలిసింది. మీరు ప్రత్యేకంగా గుర్తించిన బాధితులతో ఆహా.. ఓహో అని శెభాష్ అనిపించుకున్న తీరు అందరూ చూశారు. గతంలోనూ తిత్లీ తుపాను వచ్చిన సమయంలో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే… పక్క జిల్లాలోనే ఉన్న మీరు కనీసం బాధితులను పరామర్శించడానికి రాని మీ తీరు అందరికీ గుర్తుంది. మీరు అప్పట్లో తుపాను ఫండ్ కు పైసా కూడా రాల్చని బ్రహ్మాండమైన సాయం అందరికీ తెలుసు. 6 రోజుల పాటు తుపాను బాధితులకు అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. అది ఆయన మంచి మనసు. మీరు ఎన్ని బూటకపు మాటలు, విమర్శలు చేసినా ప్రజలంతా జనసేనకు అండగా ఉంటారు.