Connect with us

Patriotism

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు @ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం

Published

on

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో సహసమర్పణలో జనవరి 26, గురువారం సాయంత్రం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిల్పిటాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఇది వారాంతం కాకపోయినప్పటికీ 200 పైచిలుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.

డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి (Dr. Hanimireddy Lakireddy) భవనంలో సిలికానాంధ్ర కార్యకర్తలు కిరణ్ సింహాద్రి, లలిత అయ్యగారి స్వాగత వచనాలతో, కుమారి ఈశా తనుగుల ప్రార్థనాగీతంతో సభ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాన్సుల్ జనరల్ (Consul General) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ 74 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని, భారత ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను సభికులకు వివరించారు. ముఖ్యంగా అనేక అమెరికా విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ కోర్సులను ప్రవేశపెట్టడానికి ఉత్సుకత చూపిస్తున్నాయని అలానే భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా అమెరికాలో తమ శాఖలను ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రాంతీయంగా ఉన్న అనేక భారతీయ రాష్ట్రాల సంస్థలు, వారి సభ్యులు, వారి వారి భాషల్లో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ విభిన్న భాషా, సంస్కృతుల సమాహారమై భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity) చాటి చెప్పే భారతీయతను ప్రేక్షకులకు చవిచూపించారు. భారతి తమిళ సంఘం, మలయాళీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ప్రవాసి బెంగాలీ అసోసియేషన్, రాజస్థాన్ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా, ఉత్తరప్రదేశ్ మండల్ ఆఫ్ అమెరికా, తదితర సంస్థల సభ్యులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల (Anand Kuchibhotla) మాట్లాడుతూ భారతీయులు అమెరికాకు వలస రావడం మొదలై 100 సంవత్సరాలు పైబడుతున్నా ఇప్పటివరకు ఎవరూ సాహసించనిది, సిలికానాంధ్ర మాత్రమే సాధించినది, భారతీయ విలువలతో ఉన్నత విద్యను అధ్యయనం చేసే అవకాశం కల్పించే అమెరికా విశ్వవిద్యాలయ స్థాపన చెయ్యడమని అదే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయమని సబికుల హర్షాతిరేకాల మధ్య తెలియజేశారు.

ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే కూచిపూడి (Kuchipudi), భరతనాట్యం కర్ణాటక సంగీతం, హిందుస్తానీ మరియు తెలుగు, సంస్కృతం లలో సర్టిఫికెట్, డిప్లమా, మాస్టర్స్ డిగ్రీ కోర్సులు ఉన్నాయని ఈ సెప్టెంబర్ నుంచి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ (Computer Science) ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.

మిల్పిటాస్ (Milpitas, California) నగర కౌన్సిల్ మెంబర్ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి నగర అడ్మినిస్ట్రేషన్ తరుపున అభినందన పత్రాన్ని అందజేశారు. రెండు గంటల పైన జరిగిన ఈ అందమైన సభ నిర్వాహకులు అతిధులకు ఏర్పాటుచేసిన విందు భోజన కార్యక్రమంతో ముగిసింది.

సిలికానాంధ్ర (Silicon Andhra) కార్యకర్తలు మువ్వన్నెల జెండాలతో, మూడు సింహాల గుర్తులతో ఆకర్షణీయంగా ఏర్పాటుచేసిన ఫోటో బూత్ లో సభికులందరూ ఫోటోలు తీసుకుంటూ, ఈ అనుభూతిని కలకాలం పదిలపరచుకోవడం కొసమెరుపు.

ఈ గణతంత్ర దినోత్సవ (Republic Day) కార్యక్రమం విజయవంతం కావడం కోసం విశేష కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు సాయి కందుల, దిలీప్ సంగరాజు, శివ పరిమి, గిరి తనారి, శ్రీరామ్ కోట్ని తదితరులకు కాన్సుల్ జనరల్ తన అభినందనలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected