ఇండియాలో కరోనా ఉధృతి ఇంటర్నేషనల్ విమానసర్వీసులపై ప్రభావం చూపించనుంది. పలు దేశాలు తమ విమాన సర్వీసులను కుదించడమో, తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తున్నాయి. ప్రయాణికులపైనా ఆంక్షలను విధించాయి. బ్రిటన్ భారత్‌ను ‘రెడ్‌లిస్ట్’లో పెట్టిన విషయం తెలిసిందే. భారత్ నుంచి అదనపు విమానాలు దిగడానికి అనుమతి ఇవ్వబోమని లండన్‌లోని హీత్రో విమానాశ్రయం స్పష్పంచేసింది. దుబాయ్ భారత్ మధ్య విమాన సర్వీసులను ఏప్రిల్ 25 నుంచి 10 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ఎమిరేట్స్ ప్రకటించింది. భారత్ సహా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విమానాలను 30% మేర తగ్గించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. భారత్ సహా హై-రిస్క్ దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరుల సంఖ్యపైనా పరిమితి విధిస్తామని స్పష్టం చేసింది. గత 14 రోజులుగా భారత్‌లో ఉంటూ సింగపూర్ రావాలనుకునే దీర్ఘకాల, తక్కువ కాలవ్యవధి పాస్‌పోర్టులు ఉన్నవారికి దేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వబోమని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. భారత్ నుంచి వచ్చినవారు 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.