49 సంవత్సరాల క్రితం మొదలై, నేటికీ తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను ఈ తరానికి కూడా అందిస్తూ, వేలాది మంది తెలుగు వారి సమక్షంలో అద్వితీయ వేదిక కల్పిస్తున్నది బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS).
2023 దసరా, దీపావళి (Diwali) సంబరాలను అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) అధ్యక్షతన సుమారు 1500 మంది భారతీయుల మధ్య ఘనంగా నిర్వహించారు. పెద్దలు యడ్ల హేమప్రసాద్, మూల్పూరి వెంకట్రావు, సతీష్ వేమన, నరేన్ కొడాలి (Naren Kodali), సాయి కాంత, తేజ రాపర్ల పాల్గొన్నారు.
సాయంత్రం 4 గంటల నుండే మొదలైన ఈ వేడుకలలో తెలుగు వారి పండుగ దుస్తులలో చిన్నారులు, మనదైన చీరకట్టుతో మహిళలు విచ్చేసి సందడి చేశారు. విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం పెద్దలు, అతిధులు, తార తోరణంతో మరియు పసందైన తెలుగింటి భోజనంతో సుమారు రాత్రి 10:30 గంటల వరకూ సాగింది.
ప్రత్యేకంగా తెలుగు సినీ చరిత్రలో ఏడు దశాబ్దాల నట ప్రస్థానంలో వెలుగొందిన నట సామ్రాట్, పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారికి శత జయంతి సంవత్సర సందర్భంగా ఘన నివాళి అర్పించారు. శ్రమ, క్రమశిక్షణ పాటిస్తూ నట వృత్తి లో అసమాన ప్రమాణాలు నెలకొల్పిన తెలుగు కళా దిగ్గజం అని వక్తలు కొనియాడారు.
ఈ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) దసరా, దీపావళి సంబరాలలో ప్రముఖ సినీ కథానాయిక సంయుక్త మీనన్ (Samyuktha Menon) పాల్గొని అలరించారు. సభికుల ప్రశ్నలకు సమాధానాలతో, చిన్నారులు, మహిళలతో ఫొటోలతో చాలా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.
అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ.. ఎందరో ఔదార్యం, సహకారంతో మొదలైన ఈ సంస్థ 2024 లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ, వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు ప్రత్యేక కృతఙ్ఞతలు అని తెలిపారు. ఎల్లప్పుడూ భాష, కళా వారసత్వాన్ని ముందుకు కొనసాగించటమే తమ లక్ష్యమని, భారతీయతను నిలుపుకోవటయే సంస్థ ఆదర్శమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంస్థకు, కార్యక్రమాలకు తెలుగింటి రుచులనందిస్తున్న మయూరి ఇండియన్ రెస్టారెంట్ (ప్రదీప్ గౌర్నేని) కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana), విద్యా వేత్త, పెద్దలు మూల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. ఉరకలెత్తే యువకుల ఉత్సాహంతో రాబోయే సంవత్సర స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని, మనదైన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఏ దేశ మేగినా నలుగురితో కలిసి పోవటమే జీవిత సారమని, ఎల్లప్పుడూ సంస్థకు సహకరిస్తామని తెలిపారు.
వందలాది మందికి తెలుగింటి రుచులతో పసందైన భోజనం అందించి కార్యక్రమ అనంతరం కూడా సభికులందరికి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గాన్ని మన్నే సత్యనారాయణ, రామ్ చౌదరి ఉప్పుటూరి, నాగ్ నెల్లూరి, అనిల్ ఉప్పలపాటి, సత్య సూరపనేని, సుధీర్ కొమ్మి పలువురు ప్రశంసించారు.
ఈ GWTCS కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులతో పాటు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు చంద్ర మాలావతు, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, ఉమాకాంత్, విజయ్ అట్లూరి, రాజేష్ కాసారనేని, శ్రీవిద్య సోమ తదితరులు పాల్గొన్నారు.