గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి చేయూత నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులకు తాజా సాంకేతికత వాడి సమర్ధవంతంగా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు పలు ఉపకరణాలు అందించారు.
రెండు వేర్వేరు పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గేట్స్ తరపున సాంస్కృతిక కార్యదర్శి నవీన్ బత్తిని ప్రత్యక్షంగా పాల్గొని ఈ సహాయం చేశారు. తను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అమెరికా వెళ్లగలిగానని, ప్రస్తుత విద్యార్థులు కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహించడానికి తెలంగాణ లో ఈ ప్రాజెక్ట్స్ చేపట్టామని అన్నారు.
మొదటగా జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం, వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డిజిటల్ పద్ధతి ద్వారా విద్యనందించేలా స్మార్ట్ టీవీని బహుకరించారు. అలాగే జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, యూసుఫ్నగర్ గ్రామంలోని మరో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డిజిటల్ సౌకర్యాలు సమకూర్చారు.
తమ పాఠశాలలకు ఇంతలా సహాయం చేసిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ కార్యవర్గ సభ్యులను, బోర్డు సభ్యులను పాఠశాల సిబ్బంది అభినందించారు. పేద ప్రజల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు వెన్నుదన్నుగా నిలబడేలా ఇంకా సహాయం చేయదలచిన వారు గేట్స్ వెబ్సైట్ www.gatesusa.org ని సందర్శించండి. అలాగే తెలంగాణాలో ఈ కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తున్న స్థానిక వాలంటీర్స్ కి నవీన్ బత్తిని కృతజ్ఞతలు తెలియజేశారు.
గేట్స్ 2022 అధ్యక్షులు సునీల్ గోటూరు, ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి, ఉపాధ్యక్షులు జనార్ధన్ పన్నెల, జనరల్ సెక్రెటరి శ్రీనివాస పర్స, కోశాధికారి సందీప్ రెడ్డి గుండ్ల, కల్చరల్ సెక్రెటరి నవీన్ బత్తిని, ఈవెంట్ సెక్రెటరి చలపతి వెన్నమనేని, మీడియా సెక్రెటరి గణేష్ కాసమ్, టెక్నాలజీ సెక్రటరి రమణ గాండ్ర, స్పోర్ట్స్ కీర్తిధర్ గౌడ్ చెక్కిలా, బోర్డు డైరెక్టర్లు రామాచారి నక్కెర్టి, జోత్న్స పాలకుర్తి, కిషన్ తల్లపల్లి, రఘువీర్ రెడ్డి గుడిపల్లి, నవీన్ ఉజ్జిని మరియు ఇతర కార్యవర్గసభ్యులు, వాలంటీర్స్ అందరినీ ఇటు అమెరికా అటు తెలంగాణ రాష్ట్ర వాసులు అభినందిస్తున్నారు.