Connect with us

Cultural

ఆషాడ మాసం సందర్భంగా ఘనంగా ఆడపడుచుల గోరింటాకు పండుగ: TANA @ Virginia

Published

on

Virginia: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా (TANA) ఆధ్వర్యంలో “ఆడపడుచుల గోరింటాకు పండుగ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తానా సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali), ఈనాడు ఎడిటర్ డీఎన్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పెద్ద సంఖ్యలో స్థానిక తెలుగు మహిళలు పాల్గొన్నారు. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తెలుగు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని సాయిసుధా పాలడుగు (SaiSudha Paladugu) అన్నారు.

అమెరికాలో తెలుగువారి జీవన విధానం, సంస్కారాలు, పండుగల్ని భావితరాలకు తెలియజేయడం కోసం…భాష కట్టుబొట్టుల్ని కాపాడడం కోసం తానా (TANA) ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. నరేన్ కొడాలి (Naren Kodali) మాట్లాడుతూ…” అయిదు దశాబ్దాల తానా సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు, మరెన్నో ఆటుపోట్లు తట్టుకుని సగర్వంగా నిలబడి తన ఉనికిని చాటుకుంది.

భవిష్యత్తులో 50 వసంతాలకు చేరుకోనున్న సందర్భంగా “న భూతో న భవిష్యతి” అన్న రీతిలో తెలుగు వారికి కీర్తి దశదిశలా వ్యాప్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రవాసాంధ్రులు వీటిలో భాగస్వాములై విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు. మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ…. అమెరికాలోని తెలుగుదనాన్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి అమ్మ భాషకు, తెలుగుజాతికి గుర్తింపు, గౌరవాన్ని ‘తానా’ తీసుకొచ్చిందని కొనియాడారు.

ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని తెలిపారు. “మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనగుడ సాగించలేదు. అనేక జాతులు మాతృభాషను విస్మరించి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది చరిత్ర చెప్పే సత్యం. భాష సాంస్కృతిక వారథి. అందుకే మాతృభాష మృతభాష కాకూదని ఇక్కడి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయం” అని మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సుధీర్ కొమ్మి (Sudheer Kommi), జానీ నిమ్మలపూడి, రాజేష్ కాసరనేని, అనిత మన్నవ, శ్రీవిద్య సోమ, అనీల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శాంతి పారుపల్లి,కవిత చల్లా,త్రిలోక్ కంతేటి, సాయి బొల్లినేని, సత్య సూరపునేని, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected