జనార్ధన్ పన్నెల. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు, ముఖ్యంగా అమెరికాలో. ఎందుకంటే జానపద పాటలను పాడడంలో దిట్ట, అమెరికాలో ఎన్నో ఈవెంట్స్ లో పాడి పాడి జార్జియా జానపద జనార్ధన్ గా ప్రఖ్యాతి చెందారు కాబట్టి. ఈ 2023 వినాయక చవితి సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు.
‘గం గం గణనాథ..’ అంటూ మరో చక్కని పాటతో శ్రోతల ముందుకు వచ్చారు. గణేష్ పండుగ విశిష్టతను తెలుపుతూ గణేష్ నవరాత్రి వేడుకలలో అందరు పాడుతూ, ఆడుతూ ఆ గణనాథుణ్ణి స్మరించుకునే విధంగా రూపొందించిన పాటను తన అద్భుతమైన గళంతో పాడిగురువారం సెప్టెంబర్ 14న విడుదల చేశారు.
అంతకు ముందు సెప్టెంబర్ 10 ఆదివారం సాయంత్రం జాన్స్ క్రీక్, అట్లాంటాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రోమో విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. 2017 లో బతుకమ్మ పాట అనంతరం ఇప్పుడు 2023 లో ఈ గం గం గణనాథ పాట అందరినీ బాగా ఆకట్టుకుంది.
ఈ పాటకి ప్రవీణ్ మాచవరం సాహిత్యం, సుధాశ్రీనివాస్ పెరంబుదూరి సంగీతం, శివ తుర్లపాటి నృత్యం, కిషోర్ తాటికొండ సినిమాటోగ్రఫీ మరియు నారాయణ పల్లా ఆడియో సమకూర్చారు. ఇప్పటికే తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ, ఆస్కార్ అవార్డు గ్రహీత & గీత రచయిత చంద్రబోస్ వంటి తెలుగు చిత్రపరిశ్రమలోని సెలబ్రిటీస్ ల మన్ననలు పొందారు జనార్ధన్ పన్నెల.
వినాయక చవితి సందర్భంగా జనార్ధన్ పన్నెల (Janardhan Pannela) విడుదల చేసిన ఈ గం గం గణనాథ పూర్తి పాటను పన్నెల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ లో వీక్షించవచ్చు. ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుండి వేల సంఖ్యలో ఈ పాటను చూడడంతో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.