కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి సూచనలతో ఈరోజు ఉదయం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో, ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి సహకారంతో TANA కార్యదర్శి రాజా కసుకుర్తి దాతృత్వంతో కమ్యూనిటీ హాలులో ఉచిత మెగా కంటి శిబిరాన్ని (Eye Camp) నిర్వహించి, కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్రచికితలు, కళ్ళ అద్దాలు సిఫారసు చేశారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ ఆవరణలో రంగన్నగూడెం (Ranganna Gudem) రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి, సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షతన గ్రామస్తులు, లబ్ది దారులతో సభ నిర్వహించారు.
ఈ సభలో ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. తానా (TANA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 20వేల మందికి ఇప్పటికే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, పదివేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం ముదావాహం అని అన్నారు. రాబోయే రోజుల్లో వీటితోపాటు రంగన్నగూడెం, వీరవల్లి గ్రామాల్లో రైతుల మెరిట్ పిల్లలకు స్కాలర్ షిప్లు లు అందించాలని రాజా కసుకుర్తికి సూచించారు.
తానా (Telugu Association of North America) తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. విద్య మన పిల్లలకు ఆస్తి అని, గ్రామాల్లో తమ పిల్లలను ప్రాథమిక స్థాయిలో మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు.
తానా కార్యదర్శి రాజా కసుకుర్తి మాట్లాడుతూ.. 2023-25 కాలంలో తానా (TANA) తరపున రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రైతులకు అవసరమైన రక్షణ కిట్లు, లాభసాటి వ్యవసాయం మీద వ్యవసాయ సదస్సులు నిర్వహించడానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ప్రముఖ కంటి శస్త్ర చికిత్స నిపుణురాలు (Eye Surgeon) డాక్టర్ గొట్టుముక్కల వాసవి మాట్లాడుతూ.. షుగర్ వ్యాధి, రక్తపోటు ఉన్నవారు రెగ్యులర్ గా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యుల సలహా ప్రకారం నడవకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని, చూపు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఉచిత కంటి వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకొని అవసరమైన శస్ట్ర చికిత్సలు కంటి అద్దాలు ఉచితంగా పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ పుసులూరు లక్ష్మీనారాయణ, ఆర్ ఆర్ డి ఎస్ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య, డాక్టర్ కసుకుర్తి లీలాకాంత్ తదితరులు ప్రసంగించారు. అనంతరం తానా సంస్థ ద్వారా సేవలందిస్తున్న తానా మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా కార్యదర్శి రాజా కసుకుర్తి, రోటరీ ద్వారా సేవలందిస్తున్న డాక్టర్ గొట్టిముక్కల వాసవి, ఆర్మీ ద్వారా దేశానికీ సేవలందిస్తున్న డాక్టర్ కసుకుర్తి లీలాకాంత్, ఆర్ ఆర్ డి ఎస్ ద్వారా సేవలందిస్తున్న ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావును గ్రామ ప్రజాప్రతినిధులు దుస్సాలువాతొ ఘనంగా సత్కరించి మెమెంటోలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కసుకుర్తి వేణుబాబు, మొవ్వా వేణుగోపాల్, కసుకుర్తి అర్జునరావు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, ఆలపాటి శ్రీనివాసరావు, ఆళ్ళ గురవయ్య,ఆశా వర్కర్లు పి. తేజస్విని, ఎం. జాస్మిన్ రాణి, ఎం. నాగ లలిత మరియు రోటరీ సిబ్బంది ఎల్.డి ప్రసాద్, టి పవన్ కుమార్, వై వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా కంటి వైద్య శిభిరం లో రంగన్నగూడెం చుట్టుపక్కల గ్రామాల నుంచి 200 మంది సేవలు వినియోగించుకున్నారు.