St. Louis, Missouri, April 5, 2026: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) పేదలకు ఆహారం అందించే ఫుడ్‌బ్యాంక్ (Food Bank) లో సేవలు అందించింది.
మిస్సోరి చాప్టర్ (NATS Missouri Chapter) ఆధ్వర్యంలో బ్రిడ్జ్‌టన్ లోని సెయింట్ లూయిస్ (St. Louis) ఏరియా ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సభ్యులు ఈ సేవలు అందించారు. నాట్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
సుమారు 30 మంది NATS (North America Telugu Society) వాలంటీర్లు ఏకధాటిగా రెండు గంటల పాటు శ్రమించి, మొత్తం 5,766 పౌండ్ల (సుమారు 2.88 టన్నుల) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం (Ramesh Bellam), నాట్స్ మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల సహా మధుసూధన్ దద్దాల, నరేష్ రాయంకుల తదితర ముఖ్య సభ్యులు కీలకపాత్ర పోషించారు.
నాట్స్ వాలంటీర్లు (Volunteers) ఇందులో ఎంతో ఉత్సాహంగా తమ విలువైన సేవలు అందించారు. తక్కువ సమయంలోనే ఇంత భారీ మొత్తంలో ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా సిద్ధం చేయడం పట్ల ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో స్థానిక ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాట్స్ మిస్సోరీ చాప్టర్ (NATS Missouri Chapter) నిర్వాహకులు పేర్కొన్నారు.
ఫుడ్ బ్యాంక్‌లో సేవలు అందించిన నాట్స్ (NATS) సభ్యులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) ప్రత్యేకంగా అభినందించారు.