తెలుగుజాతిని అభివృద్ధి పథంలో నిలిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా (Florida) రాష్ట్రం జాక్సన్విల్ (Jacksonville) నగరంలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సుమంత్ ఈదర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు చేతబూని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు మద్దతుగా తమ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా అనిల్ యార్లగడ్డ మాట్లాడుతూ.. తెలుగుజాతి దార్శనికుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న పరిశ్రమలు తరలివెళ్తున్నాయి. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడతారన్నారు.
జాక్సన్విల్ నగర అధ్యక్షులు ఆనంద్ తోటకూర మాట్లాడుతూ.. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన సాగించారు. విప్లవాత్మక నిర్ణయాల ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అలాంటి వ్యక్తిని కనీస ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.
సుమంత్ ఈదర మాట్లాడుతూ.. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. పగ, ప్రతీకారమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోంది. అభివృద్ధిని కాలరాసి ప్రత్యర్థులను జైలుకు పంపడమే లక్ష్యంగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అవినీతి జరగకపోయినా చంద్రబాబు గారిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారన్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలన్నారు.
ఈ నిరసన (Protest) కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బాబు కొర్రపాటి, కార్యదర్శి నిమ్మల మన్నె, సోషల్ మీడియా సమన్వయకర్త ఆనంద్ వక్కలగడ్డ తదితరులు పాల్గొన్నారు.