పిఠాపురం, సెప్టెంబర్ 9: కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు, అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత, తెలుగు భాష, సంస్కృతి, సాహితీ సంప్రదాయాల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం నిరంతరం శ్రమిస్తున్న కృషీవలుడు డా. తోటకూర ప్రసాద్ కు సెప్టెంబర్ 9న పిఠాపురంలో వేలాదిమంది సభ్యుల సమక్షంలో అందజేయడం ఆనందంగా ఉన్నదని ఉమర్ ఆలీషా సాహితీ సమితి, భీమవరం ప్రకటించింది.
అనంతరం పురస్కారగ్రహీత డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎందరో సుప్రసిద్ధ సాహితీవేత్తలు, పండితులు, అవధానులు, భాషాసేవకులు ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారని, అంతటి చరిత్రగల్గిన పరంపరలో తాను ఈ పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది ప్రవాసాంధ్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, ఈ పురస్కారానికి తనను ఎంపికచేసిన సాహితీ సమితి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.
550 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల్గిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక, సాహిత్య, సేవాకృషి చేస్తున్న విశిష్టవ్యక్తి ప్రస్తుత నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్నారని డా. ప్రసాద్ తోటకూర వెల్లడించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతో తానా సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రచురించిన ప్రముఖ కవి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం మొత్తం 6 సంపుటాలను శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గ్రంధాలయానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారికి, మరో 6 సంపుటాలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి నన్నయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. కె. పద్మరాజు గారికి తానా కానుకగా తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకలు డా. తోటకూర ప్రసాద్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డా. పింగళి ఆనందకుమార్, ఎన్. టి. వి. ప్రసాద వర్మ, ఏవివి సత్యనారాయణ, తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, పద్యకవి వామరాజు సత్యమూర్తి, సాహితీ విమర్శకుడు రోచిష్మాన్ శర్మ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. కె. పద్మరాజు, జేఎన్టీయూ విశ్రాంత ఆచార్యులు డా. ఈశ్వర్ ప్రసాద్, డా. ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ శ్రీమతి వి. మాధవి, సాహితీసమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, వడ్డి విజయలక్ష్మి, త్సవటపల్లి సాయి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.