సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ మోసం చేసిన సంగతి తెలిసిందే. రైతులు దీనిపై కోర్టుల్లో ఒక పక్క న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇంకోపక్క ప్రజా క్షేత్రంలో కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సాటిచెప్పాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’ ప్రారంభించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం.
అమెరికాలోని షార్లెట్ నార్త్ కరోలినా తెలుగు ఎన్నారైలు అమరావతికి మొదటి నుంచి మద్దతు తెలుపున్నారు. ఎప్పుడూ రోడ్లెక్కని మహిళలు, రైతన్నలను పాదయాత్రలో చూసి చలించిన షార్లెట్ తెలుగు ఎన్నారైలు, ఇంకో అడుగు ముందుకేసి మేముసైతం అంటూ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీకి 6 లక్షల రూపాయల విరాళం అందించారు. పాదయాత్రలో భాగంగా నవంబర్ 12 శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గిర ఓబన్నపాలెంలో భోజన విరామ సమయంలో ఆచార్య రంగా భవన్లో విరాళం అందజేశారు. షార్లెట్ ఎన్నారైల తరపున వారి తల్లితండ్రులు చెక్కును రైతుల సమక్షంలో అమరావతి జేఏసీ ప్రతినితి పీవీ మల్లిఖార్జునరావుకి అందించారు.
ఈ సందర్భంగా విరాళాలు అందించిన సుమారు 70 మంది షార్లెట్ తెలుగు ఎన్నారైలను అమరావతి రైతులు మరియు జేఏసీ ప్రతినిధులు తమకు కష్టనష్టాల్లో తోడు నీడగా ఉంటున్నందుకు అభినందించారు. అనుకున్నదే తడవుగా అతి తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా నిధులు సమీకరించడం, అందునా అమరావతి జేఏసీ కి డైరెక్ట్ గా అందించడం అభినందనీయం. చిత్తశుద్ధి, మంచి మనస్సు ఉంటే ఏవీ అడ్డంకి కాదని షార్లెట్ ఎన్నారైలు మరోసారి నిరూపించడమే కాకుండా అమెరికాలోని మిగతా రాష్ట్రాల ఆంధ్రులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.