సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరియు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య చేతుల మీదుగా హైదరాబాద్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ని ఘనంగా సన్మానించారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 5న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.డి. లక్ష్మీనారాయణ (Vasagiri Venkata Lakshminarayana) మాట్లాడుతూ సమాజాభివృద్ధికి పాటుపడుతూ దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక మరియు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటల్ బిహారి వాజపేయి ఫౌండేషన్ గౌరవ ఛైర్ పర్సన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య మాట్లాడుతూ దివ్యాంగులు తమ మేధస్సుకు పదును పెడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదని అన్నారు.
అనంతరం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిగా (TANA) ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ని శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. యార్లగడ్డ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ తరపున వికలాంగుల అభ్యున్నతికి చేపడుతున్న, అలాగే ముందు ముందు 80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.
చివరిగా పలువురు దివ్యాంగులకు శీతాకాల రగ్గులు పంపిణీ జేశారు. అలాగే రవి సామినేని కి పురస్కారం అందజేశారు. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ, నాగేశ్వరరావు కొల్లి, శ్రీకాంత్, ఎస్. రవి, నాగేశ్వరరావు బండి, మిమిక్రి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.