Connect with us

Literary

ATA@Dallas: సాహితీ ప్రామాణిక విలువలను పెంచుతూ శతావధానం, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA), సాహిత్యవేదిక తన సాహితీసేవా ప్రామాణిక విలువలను పెంచుతూ జరిపిన శతావధానం ఆటాసంస్థ కీర్తి కిరీటంలో ఇంకో కలికితురాయిగా నిలిచింది. ఆటా సాహిత్యవేదిక నిర్వహించిన త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ (Brahmasri Vaddiparti Padmakar) గారి షోడషశతావధాన మహాప్రక్రియకు శనివారం ఏప్రిల్ 29,2023 న డాలస్ మహానగరంలోని, ఫ్రిస్కో (Frisco) వేదికయ్యింది.

శతాధిక పృఛ్ఛకులు, ముగ్గురు అప్రస్తుత ప్రసంగీకులు, 35 సమస్యలు, 35 వర్ణనలు, 35 ఆశువులతో అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండువుగా సాగింది. సాహిత్యవేదిక అధిపతి శ్రీమతి సింగిరెడ్డి శారద (Sharada Singireddy), ఆటా అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని (Madhu Bommineni) ముందుండి నడిపిన ఈ శతావధాన ప్రక్రియ ఆద్యంతం అమెరికా వాసులకు తెలుగుభాష మీదున్న పట్టును, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారి ధారణా శక్తికి అద్దం పట్టాయి. అనంతరం వద్ధిపర్తి దంపతులకు కనకాభిషేకం చేసి “అవధాన విశ్వగురుబ్రహ్మ” బిరుదు ప్రదానం చేసారు.

ముందుగా ఈ కార్యక్రమానికి పాలకమండలి సభ్యులు సతీష్ రెడ్డి, సోమ శేఖర్ రెడ్డి, రామ్ అన్నాడి, పూర్వాధ్యక్షులు డా.సంధ్య గవ్వ, శ్రీనివాస్ పిన్నప రెడ్డి, ఆత్మచరణ్ రెడ్డి, ఆటా కార్యవర్గ బృందం అనంత్ రెడ్డి పజ్జూర్, రవి తూపురాని, నీరజ పడిగెల, స్వప్న తుమ్మపాల, మంజు రెడ్డి ముప్పిడి, సుమన బీరం, లక్ష్మి పోరెడ్డి, మహేందర్ గణపురం, సత్య పెర్కారి, వెంకట్ కోడూరి, దామోదర్ ఆకుల,అశోక్ పొద్దుటూరి, విక్రమ్ బొర్ర, శ్రీనివాస్ కల్లూరి, రవికాంత్ మామిడి, సుధాకర్ కలసాని, అనురాధ మేకల కలసి పూర్ణకుంభంతో అవధానుల వారిని సభకు ఆహ్వానించి, జ్యోతిప్రజ్వలన గావించారు.

తర్వాత మల్లికా సుర్యదేవర ప్రార్ధనాగీతం ఆలపించారు. అనంతరం ఆటా సాహిత్యవేదిక అధిపతి శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని ని, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారిని, సంచాలకులు డా.పుదూర్ జగదీశ్వరన్ మరియు డా.మద్దూరి వేంకట సుబ్రహ్మణ్యసత్యనారాయణ గార్లను సభకు పరిచయం చేయగా, డా.మద్దూరి వేంకట సుబ్రహ్మణ్య సత్యనారాయణ గారు బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గురించి మరిన్ని విశేషాలను సభాసదులకు తెలియజేశారు.

అనంతరం ’అమెరికా అవధాని’ డా. పుదూర్ జగదీశ్వరన్ సంచాలకులుగా వ్యవహరించి పృఛ్ఛకులకు, విచ్చేసిన వీక్షకులకు శతావధాన ప్రక్రియ నియమాలను వివరించారు. తరువాత బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు ఇష్టదేవతా ప్రార్ధనతో శతావధానాన్ని ప్రారంభించారు. సాధారణంగా మూడురోజులపాటు శతావధానం జరగాల్సి ఉంది.

కానీ నిర్వాహకుల సంసిద్ధత మరియు “సప్తఖండ అవధాన సాహితీ ఝరి” సృష్టికర్త, సహస్రావధాని వద్ధిపర్తి పద్మాకర్ గారి పాండిత్యసమర్ధత, డాలస్ “పెద్దనామాత్యులు”గా ప్రసిద్ధులయిన శ్రీ డా.పుదూర్ జగదీశ్వరన్ గారు మరియు ధార్మిక ప్రవచనశేఖర బిరుదాంకితులు డా.మద్దూరి వేంకట సుబ్రహ్మణ్యసత్యనారాయణ గారు సంచాలకులుగా వ్యవహరించడం, ప్రాజ్ఞులయిన ప్రృఛ్ఛకుల నిబద్దత మూలంగా ఒకే రోజులో పూర్తి చేయగలిగారు.

సమస్యా విభాగములో పృఛ్ఛకులు ఆడిగిన ప్రతీసమస్యను అలవోకగా అవధానిగారు పూరించారు. ఉదాహరణకు చంద్రశేఖర్ జలసూత్రం అడిగిన “రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతమ్ములో” సమస్యకు, గౌతమ్ కస్తూరి “పౌండ్రక వాసుదేవునకు పాదములొత్తెను సత్యభామయున్” సమస్యకు వద్దిపర్తి గారి పూరణ విశేషప్రతిభకు నిదర్శనం. అలాగే మాధురి చామర్తి “తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయితే”, పరిమళ మార్పాక “కోవిదుడికి కోవిడ్ వస్తే?”, ఉదయ్ వొమరవెల్లి “అమెరికా పిల్లలు తెలుగు భాష నేర్చుకోవడం” మీద ఆశువుగా అల్లిన పద్యాలు సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించాయి.

ఇంకా మురళి శ్రీరాం టెక్కలకోట వర్ణణాంశం “ఓం! అంటావా మామా, హరిఓం!! అంటావా”, మూర్తి జి అందవోలు వర్ణణాంశం “వినత, కద్రువల పంతం” సాహితీప్రియులను రంజింపజేసాయి. డా. నరసింహారెడ్డి ఊరిమిండి, డా. వంగూరి చిట్టెన్ రాజు, విజయసారధి జీడిగుంట్ల అప్రస్తుత ప్రసంగీకులుగా అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి లేఖకులుగా డా. రమణ దొడ్ల, ఉపలేఖకులుగా వేంకట రామారావు పాలూరి వ్యవహరించారు.

చివరగా త్రిభాషాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అధ్బుతమైన సమస్యలు, ఆశువులు, వర్ణనలతో సభను మరింత రక్తికట్టించిన పృఛ్ఛకులను, అప్రస్తుత ప్రసంగీకులను ప్రశంసించారు, అలాగే ఆటా కార్యవర్గాన్ని, డాలస్ తెలుగు ప్రజలను అభినందించారు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఆటా అంటే తెలుగు, తెలుగు అంటే ఆటా అనేలా ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆటా సంస్థకు తమ దివ్యాశీస్సులు అందించారు.

ఆటా (American Telugu Association) అధ్యక్షులు శ్రీమతి మధు బొమ్మినేని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు. సాహిత్యవేదిక సభ్యులు శారద సింగిరెడ్డి, రవి తూపురాని, వీరన్న పంజాల, మాధవి దాస్యం లను అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected