లండన్ లో 17 సెప్టెంబర్ 2023 నాడు జరిగిన ‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ సభ లో యాత్రా రచయితలు తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు. యాత్రా రచయిత డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు ఇంగ్లీష్ లో రాసిన ఈ యాత్రా కథనాలను ప్రముఖ తెలుగు సాహిత్యకారులు దాసరి అమరేంద్ర గారు అనువాదం చేసి ప్రచురించారు. అమరేంద్ర గారు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా యూకే తెలుగు సాహితి మిత్రులు ఈ సభను నిర్వహించారు.
ఇంగ్లాండ్ లోని వివిధ ప్రాంతాలనుండి 60 మందికి కి పైగా సాహిత్య మిత్రుల పాల్గొన్న సభానిర్వహణ సమన్వయకర్త సూర్య కిరణ్ ఇంజమ్ సభికులను ఆహ్వానిస్తూ ‘మూల రచయిత, అనువాదకుడు’ కలిసి, అదీ విదేశంలో పాల్గొంటున్న అరుదయిన సందర్భం అని చెప్పారు. వీరితో పాటు ఇతర రచయితలు, అనువాదకులు కూడా సభలో ఉండడం విశేషం అన్నారు.
సభా కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ వెలగపూడి బాపూజీరావు గారు దాసరి అమరేంద్ర, డాక్టర్ శేషగిరిరావు గురించి సభికులకు పరిచయం చేసారు. అమరేంద్ర గారి అనువాదం మూల రచనలో పరకాయ ప్రవేశం చేసినట్లు గా ఉందన్నారు. ముఖ్య అతిధి డాక్టర్ వెలగపూడి బాపూజీరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి కాపీని శ్రీమతి హేమ పరుచూరి అందుకున్నారు. తన భర్త శేషగిరిరావు గారి యాత్రలకు తమ కుమార్తెల తోడ్పాటు ఎంతో ఉందన్నారు. కుమార్తెలు మాట్లాడుతూ తమ తండ్రి యాత్రలు, రచనలు తమకు ఎంతో ఉత్తేజాన్నిస్తాయన్నారు.
ప్రధాన ఉపన్యాసకులు దాసరి అమరేంద్ర గారు మాట్లాడుతూ యాత్రలు మనిషిని సంస్కరిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి అన్నారు. ప్రకృతితో, మనుషులతో మమేకమై ప్రయాణాలు సాగుతాయన్నారు. యాత్ర రచనల్లో ఉండే వైవిధ్యం, స్వేచ్ఛా వ్యక్తీకరణ మిగతా సాహితీ ప్రక్రియల్లో ఉండదని చెప్పారు. తెలుగులో మహిళా యాత్రికులు పెరుగుతున్నారని చెప్పారు. తొలి యాత్రాసాహిత్య పుస్తకం ఏనుగుల వీరాస్వామి రాసిన ‘కాశీ యాత్ర’ ను ఉదహరించారు. తొలి మహిళ యాత్ర రచన జానకమ్మ ఇంగ్లాడ్ యాత్రను తలచుకున్నారు.
రచయిత, అనువాదకుడు తో పాఠకులకు జరిగిన ముఖాముఖీ సంభాషణ ఆసక్తి తో సాగింది. అనువాదకురాలు, రచయిత జయశ్రీ అట్లూరి, నగేష్ చెన్నుపాటి, రవి దండమూడి, ఇంగ్లీష్ నవలా రచయిత హేమ మాచర్ల, రామకృష్ణ లు అడిగిన ప్రశ్నలు, సమాధానాలు ఆహుతులను కట్టిపడవేశాయి. అనువాదం మూల రచన తో మమేకమై సాగిందని, రచయిత ఆత్మను పట్టించిందని చర్చలో పాల్గొన్న పాఠకులందరూ చెప్పారు.
శేషగిరిరావు నాయకత్వంలో 30 మంది పర్వతారోహితులతో ఈ నెలలో జరగబోయే హిమాలయల్లోని ’అన్నపూర్ణ పర్వతారోహణకు సన్నద్ధమౌతున్నారని’ ఆ బృందంలో సభ్యుడు రవి దండమూడి చెప్పారు. శేషగిరిరావు చేసిన 30 ప్రయాణాలను అనువదించే పనిలో ఉన్న జయశ్రీ అట్లూరి తన అనువాదానికి అమరేంద్ర గారి అనువాద పద్దతి ఉపయోగపడిందన్నారు.
ప్రశ్నలకు రచయిత శేషగిరిరావు స్పందిస్తూ తన ప్రయాణాలు ఒక లక్ష్యంతో మొదలు కావన్నారు. తన రచనా ప్రేరణకు ప్రఖ్యాత తెలుగు యాత్రికుడు, ‘భ్రమణ కాంక్ష’ రచయిత ప్రొఫెసర్ ఆదినారాయణ అన్నారు. ఆయా దేశాలలో నేను చూసిన, నన్ను ప్రభావితం చేసిన విషయాలు సమగ్రమైనవి అనుకోను. ఐతే తోటి మానవుల్ని ఒక మూసలో చూసే అలవాటు నుండి బయట పడేదానికి ఉపయోగ పడింది. ఉదాహరణకు తన అనుభవం లో ‘ఇస్లామిక్ దేశాలలో ప్రయాణం అత్యంత సురక్షితంగా సాగింది’ అన్నారు.
నా యాత్రకున్న సమయ, ఉద్దేశ పరిమితుల వలన , ఆయా దేశాల మంచి చెడులు చూసి అనుభవించే అవకాశం ఉండదన్నారు. కానీ 135 దేశాల యాత్రలు చెప్పిన సారాంశం మనుషులందరూ, మనందరం ఒకటే అన్నారు. ఈ సభ నిర్వహణకు పూనుకున్న సాహితీమిత్రులకు కృతఙ్ఞతలు చెప్పారు. సమన్వయ కర్త సూర్య కిరణ్ ఇంజమ్ కి, సూర్య కందుకూరికి, బి. రామానాయుడికి, సభకు వచ్చిన సాహితి మిత్రులకు, స్నేహితులు, ఆప్తులకు, తన కుటుంబానికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
సాహితి మిత్రుల తరపున సూర్య కందుకూరి సభను ముగిస్తూ సాహితి వేత్త అమరేంద్ర గారు, రచయిత శేషగిరిరావు గారు పాల్గొన్న ఈ సభ నిర్వహించడం సాహితి మిత్రులకు దొరికిన గొప్ప అవకాశం అన్నారు. ఆ సభను ఆశీర్వదిస్తూ వీడియో సందేశం ఇచ్చిన గొప్ప నటులు, నాటక రచయిత, దర్శకులు తనికెళ్ళ భరణి గారికి, అల్పాహారం ఏర్పాటు చేసిన సుచిత నియాతి కుటుంబానికి, ఆడియో ఏర్పాట్లు చేసిన సాయి గారికి, ఫోటోగ్రఫీ, వీడియో సహకారం అందించిన సృజన్ రెడ్డి గారికి, ఎంతో దూరం నుండి వచ్చి పాల్గొన్న పెద్దలకు, సభికులందరికి, చివరిగా తోటి సాహితీ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.