న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (New York Telangana Telugu Association) ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో బోనాల సంబురం అంబరాన్నంటింది. గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ సందడిని తలపిస్తూ కింగ్స్ పార్క్ బోనమెత్తింది.
తెలంగాణ (Telangana) దునియాలో సింగల్ పీస్. మట్టి పరిమిళం. కష్టపడే తత్వం, కలిసి బతకడం. అన్యాయాల్ని, అక్రమాలను ఎదిరించే ధీరత్వం, ఉద్వేగం. పిడికిలెత్తి ప్రశ్నించే తెగువ. ఇదీ తెలంగాణ నైజం. తెలంగాణ యిజానికి ప్రతిబింబాలే పండుగలు. సమ్మక్క-సారమ్మ సహా మరెన్నో జాతరలు.
ప్రతి పండుగ (Festival) వెనుక పరమార్ధం. ప్రతీ ఆచారం వెనుక శ్రమ జీవన వేదం దాగుంటాయి, స్పూర్తినిస్థాయి. కులమతాలు ఎన్నివున్నా భిన్నత్వంలో ఏకత్వమే తెలంగాణ మాటా.. బాటా.. భారతీయ ఆత్మకు నిండు నిదర్శనం.. తెలంగాణ. పల్లెవాకిట్లో వున్నా పట్నం బాటపట్టినా ప్రపంచ వేదికనెక్కినా ప్రతీ ఒక్కరి దిల్ కా దడ్కన్ న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA).
జూన్ 25, ఆదివారం NYTTA ఆధ్వర్యంలో బోనాల జాతరతో న్యూయార్క్ మురిసి మెరిసింది. తెలంగాణ కల్చరల్ మార్చ్‌కు సుంకేన్ మిడో స్టేట్‌పార్క్ ఆత్మీయ వేదికగా నిలిచింది. తెలంగాణ గుండె చప్పుళ్లతో న్యూయార్క్ అబ్బురపడింది. జయహో అంటూ NYTTTA సంఘంతో కలిసి తెలంగాణ ఆటపాటలను మనసారా ఆస్వాదించింది.
అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ సంస్కృతి, సంబురాలు న్యూయార్క్ (New York) లో తెలంగాణ వెలుగులు విరజిమ్మాయి. పోతరాజుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలుగు బిడ్డలు, భారతీయులు, అమెరికన్లు. ఒకరా ఇద్దరా ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఎందరెందరో తరలి వచ్చారు బోనాల జాతరకు.
బోనం (Bonam) అంటే పవిత్రమైన మనసుతొ, పరిపూర్ణ భక్తితో దైవానికి సమర్పించే నైవేద్యం, అన్నం. భగవంతుడికి ప్రకృతికి సర్వప్రాణకోటికి అనుసంధానం. ఈ బోనాల సంబురం. ఈ సందడి వెనుక సందేశం అని తెలుసుకుని చేతులెత్తి మొక్కిన మనసులెన్నెన్నో.
తెలంగాణ సంబురాలు ఒక ఎత్తు. బోనాల సందడి అంబరాన్నంటిలే కార్యక్రమాలను నిర్వహించిన తీరు మరో ఎత్తు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అంత అద్వితీయంగా బోనాల జాతరను విజయవంతం చేసింది. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతిని మరింత సుసంపన్నంగా ద్విగుణీకృతం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
పోతరాజుల విన్యాసాలు, తెలుగదనం ఉట్టిపడేలా డప్పుచప్పుళ్లతో బోనాల ఉరేగింపు. భక్తి ప్రపత్తులతో అమ్మవారిని బోనాల సమర్పణ. ప్రతీ ఘట్టం తెలంగాణకు అద్దంపట్టింది. ప్రతీ ఒక్కరికి తాము తెలంగాణలోనే ఉన్నామని అనుభూతిని కల్పించింది. ఇక తెలంగాణ వంటా వార్పు మరో హైలైట్. న్యూయార్క్‌లో తెలంగాణ వంటకాలు ఘుమఘమలాడాయి.
తెలంగాణ ఆటా పాటలతో కింగ్స్ పార్క్ మార్మోగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం అన్న మాటకు అర్ధంగా..అద్దంగా నిలిచింది కింగ్స్ పార్క్‌లో బోనాల సందడి. అంత అత్యద్భుతంగా ఈ వేడుకను నిర్వహించిన NYTTA కు వేనవేల వందనాలు.
NYTTA ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకకు అతిరథ మహారథులు తరలివచారు. కౌంటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జాన్ కైమన్, డైవర్సిటీ ఔట్ రీచ్ సఫోల్క్ కౌంటీ డైరెక్టర్ మోహీందర్ సింగ్ తనేజా, డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, సాధనారెడ్డి, డాక్టర్ భారతీరెడ్డి, డాక్టర్ రామురెడ్డి, డాక్టర్ సుధాకర్, విడియాల, గీతా విడియాల, బాజీ సూరపనేని మరియు భాగ్య సూరపనేని. ఆత్మీయ అతిథులకు కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
NYTTA సంఘం చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ -చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం, వైస్ ప్రెసిడెంట్ వాణీ సింగరికొండ, కోశాధికారి రవీందర్ కోడెల, హారిక జంగం, గీతా కంకణాల, ప్రసన్న మధిర, పద్మ తాడూరి, హరిచరణ్ బొబ్బిలి, కృష్ణా రెడ్డి తురుక, నరోత్తం రెడ్డి బీసం, సుధీర్ సువ్వ, అలేక్య వింజమూరి మరియు ప్రవీణ్ చామ సారథ్యంలో ఈ వేడుక నిర్వహించారు.
అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సతీష్ కాల్వ, ఉషారెడ్డి మన్నెం, సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి, పవన్ రవ్వ, మల్లిక్ రెడ్డి అక్కినపల్లి, డాక్టర్ వేణుగోపాల్ పల్లా, డాక్టర్ కృష్ణ బాధే మరియు రమా కుమారి వనమా అడ్వయిజరీ కమిటీ చినబాబు రెడ్డి, మధుసూధన్ రెడ్డి, ప్రదీప్ సామల మరియు శ్రీనివాస్ గూడూరు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల వేడుక తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పింది.
బోనమెత్తిన న్యూయార్క్ జయహో తెలంగాణ అని నినదించింది. న్యూయార్క్ స్థానిక మరియు జాతీయ సంస్థలు, TTA, TLCA, TANA ల నేతలు, ప్రతినిధులు వేడుకలలో పాల్గొన్నారు. న్యూయార్క్ లోని అన్నీ సంస్థల ఐక్యవేదికగా బోనాల పండగ నిలిచింది. ఇలాంటి వేడుకలు, వేదికలు మానవత్వానికి ప్రతీకలు. సంస్కృతికి పట్టుగొమ్మలు.