సుమారు 4 సంవత్సరాల క్రితం జూన్ 2019 లో జార్జియా రాష్ట్రం, మెట్రో అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో అప్పుడే పుట్టిన పాపని కనికరం లేకుండా చెట్ల పొదలో ఒక తల్లి వదిలేయడం, సమీప ఇంటివారు పాప ఏడుపు విని పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు సకాలంలో స్పందించి రక్షించిన సంచలన వార్త అందరికీ గుర్తుండి ఉండే ఉంటుంది.
ప్రత్యేకంగా అట్లాంటా వాసులను తీవ్రంగా కలచివేసిన ఆ ఘటనలో పాపకి బేబి ఇండియా (Baby India) అని హాస్పిటల్ నర్సులు పేరు పెట్టడం జరిగింది. అప్పట్లోనే దాదాపు 1000 మంది బేబి ఇండియా ని మేము దత్తత తీసుకుంటాం అంటే మేము దత్తత తీసుకుంటాం అంటూ ముందుకు వచ్చారు.
అలాగే దాదాపు 150 మంది వరకు అధికారులకు క్లూస్ (Tips) అందించారు. సుదీర్ఘ విచారణ అనంతరం గత గురువారం మే 18న ఆ పాప తల్లి ని అరెస్ట్ చేసినట్లు ఫోర్సైత్ కౌంటీ షెరీఫ్ రాన్ ఫ్రీమన్ శుక్రవారం మే 19న విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ఆ తల్లిని 40 ఏళ్ళ వయసున్న కరిమ జివాని (Karima Jiwani) గా గుర్తించారు.
10 నెలల క్రితం డిఎన్ఏ ద్వారా పాప తండ్రిని గుర్తించినట్లు, అప్పటి నుంచి స్పీడ్ అందుకున్న ఈ కేసును ఇప్పుడు ఛేదించినట్లు షెరీఫ్ రాన్ ఫ్రీమన్ తెలిపారు. పాపని వదిలేసే సమయానికి కూడా తండ్రికి కరిమ గర్భవతి అని తెలియదని కాబట్టి తండ్రి మీద ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అని అన్నారు.
ప్రస్తుతం ఫోర్సైత్ కౌంటీ జైల్లో ఉన్న కరిమ పై హత్యాయత్నం, పిల్లల్ని హింసించడం వంటి కేసులు నమోదు చేశారు. కరిమ ని అరెస్ట్ చేసే సమయానికి స్కూల్ కెళ్లే వేరే పిల్లలు కూడా తనతో ఉండడంతో వారిని జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫామిలీ సర్వీసెస్ (Georgia’s Department of Children and Family Services) విభాగానికి తరలించారు. దగ్గిర దగ్గిర 4 సంవత్సరాల వయస్సు ఉన్న బేబి ఇండియా కూడా ప్రస్తుతం జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫామిలీ సర్వీసెస్ అధీనంలో సంతోషంగా ఉందన్నారు.