ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హైస్కూల్లో స్థానిక చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ సహకారంతో విజయవాడ టాప్ స్టార్స్ హాస్పిటల్స్ (Top Stars Hospitals) ఆధ్వర్యంలో డిసెంబర్ 17 ఆదివారం రోజున ఉచిత పూర్తిస్థాయి గుండె జబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ (Member of the Legislative Council) మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్సిపీ (YSR Congress Party) నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) హాజరయ్యారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ మురుగుడు ప్రారంభించారు. డాక్టర్ సంజయ్ రోగులకు పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో ఎత్తు, బరువు, పల్స్, టెంపరేచర్, బిపి, షుగర్, ఈసీజీ, ఏకో తోపాటు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ చైర్మన్ చిల్లపల్లి నాగ తిరుమలరావు (Tiru Chillapalli) అధ్యక్షత వహించారు.
ఈ వైద్య శిబిరం లాజిస్టిక్స్ లో సహాయపడ్డ మరో అట్లాంటా ఎన్నారై మురళి బొడ్డు (Murali Boddu) కి తిరు చిల్లపల్లి ధన్యవాదాలు తెలిపారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ నాగ తిరుమలరావు పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఖరీదైన విద్య, వైద్యం పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయని, వైఎస్ఆర్సిపీ (Yuvajana Sramika Rythu Congress Party) ప్రభుత్వం వాటిని తీసుకొని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) కొత్తగా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ కు 25 లక్షల రూపాయలు వరకు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన (Janasena) నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, విజయవాడ దుర్గ గుడి ప్రత్యేక ఆహ్వాన కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
అలాగే వివిధ రంగాల ప్రముఖులు స్వర్గం పుల్లారావు, జొన్నాదుల శివప్రసాద్, MTMC హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గోలి నాగేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధులు బోడా సామ్రాజ్యం, జొన్నాదుల సత్యవతి, నగేష్, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.