అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున 15,000 మందికి పైగా హాజరయ్యె విధంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు), ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, నటి రకుల్ ప్రీత్ సింగ్, సంచలనం స్రుష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాట్లు చేస్తున్నారు.
17వ మహా సభలకు అతిథిగా రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల, ప్రతినిధులు జయంత్ చల్లా, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, సన్నీ రెడ్డి తదితరులు ఆహ్వానించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని కలిసి మాట్లాడుతూ, 1990లో ఏర్పడిన ఈ సంఘం అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కృతీ పరిరక్షణకు పాటుడపడుతున్నదన్నారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహా సభలలో వివిధ రంగాలకు చెందిన తెలుగు వాళ్ళని పిలిచి వివిధ అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానన్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా గొప్పగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆటా 17వ మహాసభల మరిన్ని వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.