కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.ఆర్.ఎం.బి చైర్మన్ ఎస్.శివనందన్ కుమార్ కు లేక రాసిన నేపథ్యంలో దీనివలన కృష్ణా బేసిన్ లోని రైతులకు, జల వనరుల శాఖ అధికారులకు జరిగిన నష్టం పై స్పందిస్తూ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు (Alla Venkata Gopala Krishna Rao) నేతృత్వంలో సాగునీటి సంఘాల రాష్ట్ర సారధులు కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి మరియు మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ల ఇతర కార్యవర్గ సభ్యులు ఈరోజు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, న్యూ ఢిల్లీ కు పూర్తి వివరాలతో ఈమెయిల్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఇదే విషయమై ఈరోజు ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ అపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ చేయడానికి కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పడిందని, ఈ విషయం మీద దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ అండర్ సెక్రటరీ ఆదేశాలకనుగుణంగా గత తెలుగుదేశం (Telugu Desam Party) ప్రభుత్వ హయాంలో 2018 జనవరిలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భవనాలను కూడా పరిశీలించడం జరిగిందని, అట్లాగే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూన్ 2020 లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయవాడ (Vijayawada) లోనే కె.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కి లేఖ రాస్తూ దాని ప్రతిని కే.ఆర్.ఎం.బి కార్యవర్గ సభ్య కార్యదర్శి,హైదరాబాద్ కు పంపడం జరిగిందని, అట్లాగే 2019 నవంబర్ లోను 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు లేక రాయడం జరిగిందని తెలిపారు.
2020 అక్టోబర్ లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడలో ఏర్పాటు చేయుట గురించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు చర్చించడం జరిగింది. ఇదిలా ఉండగా వీటికి విరుద్ధంగా 2020 డిసెంబర్ లో కె.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని విశాఖపట్టణం లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా దీని మీద 2021 జనవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 618 కిలోమీటర్లు దూరంలో కృష్ణ బేసిన్ కు అవతల గోదావరి బేసిన్ దాటి ఉన్నదని లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది అని అన్నారు. 2021 అక్టోబర్ లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా విజయవాడ లోనే కే.ఆర్.ఎం.బి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పిన మీదటే మేము అంగీకారం తెలిపామని, విశాఖపట్నం తరలించడానికి మేము వ్యతిరేకమని, కావున కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అన్నారు.
విశాఖ (Vizag) చుట్టుపక్కల కృష్ణానది లేనప్పుడు మన రాష్ట్రానికి హక్కుగా దక్కిన కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కృష్ణ నది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం,నాగార్జునసాగర్,ప్రకాశం బ్యారేజీ కింద ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, విజయవాడ పట్టణం కృష్ణ నది ఒడ్డున రైల్, రోడ్డు, విమాన,సౌకర్యం కలిగి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ (Telangana) ప్రభుత్వ అధికారులు, ఆయకట్టుదారులు, నీటి సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కే.ఆర్.ఎం.బి దృష్టికి తీసుకురావడానికి అనుకూలంగా ఉందన్నారు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్న విజయవాడలో కాకుండా కృష్ణ డెల్టా కు 400 కిలోమీటర్లు, ఎన్.ఎస్పి కి 700 కిలోమీటర్లు, శ్రీశైలం కు 800 కిలోమీటర్లు,దూరంగా గోదావరి బేసిన్ అవతల ఉన్న విశాఖపట్నంలో మూడు రాజధానుల్లో భాగంగా కార్యనిర్వాహక రాజధాని నెపంతో కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government) ప్రశ్నించారు.
గతంలో కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని, విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని ప్రతులను కే.ఆర్.ఎం.బి చైర్మన్ ఎస్. శివ నందన్ కుమార్, హైదరాబాద్ కు, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి శ్రీమతి దేభశ్రీ ముఖర్జీ, న్యూఢిల్లీకి పంపి ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లు సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్య కార్యవర్గ సభ్యులు తుమ్మల లక్ష్మణరావు, మాదాల నరేంద్ర, తుమ్మల నాగేశ్వరరావు (ఏలూరు జిల్లా), గుండపునేని శ్రీనివాసరావు (కృష్ణాజిల్లా), వేగినేటి గోపాలకృష్ణమూర్తి, దొండపాటి భాస్కరరావు,జంగా చెంచు రెడ్డి (ఎన్టీఆర్ జిల్లా), ఉప్పలపాటి చక్రపాణి (బాపట్ల జిల్లా), అంకాళ్ళ ప్రభుదాసు (గుంటూరు జిల్లా) తదితరులు పాల్గొన్నారు.