అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారానికి 478వ రోజుకు చేరుకుంది. రాజధానిగా అమరావతిని కాపాడుకునేందుకు దళితవాడల్లో శుక్రవారం నుంచి రోజుకు రెండు గ్రామాల్లో చైతన్యయాత్రలు నిర్వహిస్తామని రాయపూడి దళిత జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు. అనంతవరం, నెక్కల్లు గ్రామాల నుంచి యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. దాదాపు 40 శాతం మంది దళితులు రాజధానికి భూములిచ్చారని, దానిని వక్రీకరిస్తూ సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల రిజర్వుడ్ నియోజకవర్గంలో ఉన్న రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని అందుకే చైతన్య యాత్ర తలపెట్టామని చెప్పారు.