తన అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని ట్రవిస్ కౌంటిలో ఉన్న మాన్స్ ఫీల్డ్ డ్యామ్ మరియు దానికి అనుబంధంగా ఉన్న మినీ జలవిద్యుత్ కేంద్రాన్ని గత రెండు రోజులుగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు పరిశీలించారు. అమెరికాలో మినీ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనితీరు ప్రశంసనీయం అన్నారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ మాన్స్ ఫీల్డ్ డ్యాం ను టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న కొలరాడో నదిపై 1941 లోనే వరదల నియంత్రణ కోసం నిర్మించారని 278 అడుగుల ఎత్తులో కాంక్రీట్ డ్యాంను, రెండు కిలోమీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ నిర్మించి 36 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్, స్పిల్ వేను 714 అడుగుల ఎత్తులో 24 ఫ్లడ్ గేట్లు ఏర్పాటు చేశారని, ఈ డ్యామ్ నుంచే ఆస్టిన్ నగరానికి తాగునీరు దిగువ ప్రాంతాల్లో రైతులకు సాగునీరు డ్యాం క్రింద పర్యటక కేంద్రంగా బోట్ షికారు ఏర్పాటు చేశారని, దానికి అనుబంధంగా 108 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇదే పద్ధతిలో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది పై మూడు చెక్ డ్యాం లు ఏర్పాటుకు గత తెలుగుదేశం ప్రభుత్వ ముందు చూపుతో భూగర్భ జలాలు పెరుగుదల మరియు పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదన చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా దేశంలో 6.3% విద్యుత్ ను జల విద్యుత్ కేంద్రాల నుంచి వాడుకుంటున్నారని మరియు 31.5% పునరుత్పత్తి విద్యుత్ ను వాడుకుంటున్నారని, కర్నూలు జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రవేశపెట్టిన పంపుడు స్టోరేజ్ విధానం ద్వారా జలవిద్యుత్తును అమెరికాలో 2009 నుంచే అమలు చేస్తున్నారని తెలిపారు.
మినీ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి మన ఆంధ్ర రాష్ట్రంలోని ఉపనదుల మీద అమలు చేస్తే ఇటు రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి అటు రైతులకు సాగునీరు పూర్తిగా అందించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో “ఆళ్ళ” తో పాటుగా కృష్ణాజిల్లా ఎన్నారై సభ్యులు వేములపల్లి భాను ప్రసాద్, నెల్లూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.