Connect with us

Movies

పద్మవిభూషణ్, నటసమ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు

Published

on

Dallas, Texas: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Akkineni Foundation of America – AFA) ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసమ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారి శతజయంతి (సెప్టెంబర్ 20, 1924 – సెప్టెంబర్ 20, 2024) సందర్భంగా “నటసమ్రాట్ అక్కినేని గారి నటనాజీవితం-వివిధ కోణాలలో” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం గత ఆదివారం ఘనంగా జరిగింది.

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం (Murali Akkineni) అక్కినేని గారితో ఉన్న ప్రత్యేక అనుభందాన్ని, ఆయన జీవనప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేని (Akkineni Nageswara Rao)గారితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధంఉన్న ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు అక్కినేనిగారి అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు.

ప్రముఖ గాయని, ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరి (Sarada Akunuri) అక్కినేని గారి సమక్షంలో పాటలు పాడి వారి ఆశీస్సులు పొందగల్గడం తన అదృష్టం అన్నారు. ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల అక్కినేని గారి జ్ఞాపకశక్తి, ఆత్మీయ పలకరింపులను గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ డా. అక్కినేని నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్ట మైనది, ఆయన జీవితం నుండి నేర్చుకోవలసినది ఎంతోఉంది అన్నారు.

అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ గీతరచయిత, తెలుగు వేదకవి – “అక్కినేనితో ముచ్చట్లు”; డా. వి.ఎన్ ఆదిత్య, ప్రముఖ సినీదర్శకులు, రచయిత, నిర్మాత – “జానపద కథానాయకుడు అక్కినేని”; ఎస్. వి రామారావు, ‘సినీ విజ్ఞాన విశారద’, సినీ చరిత్రకారుడు – “అక్కినేని జైత్రయాత్ర”; బలభద్రపాత్రుని రమణి, ప్రముఖ సినీకథా రచయిత్రి, నందిపురస్కార గ్రహీత – “నవలానాయకుడు అక్కినేని”; కాదంబరి కిరణ్, ప్రముఖ సినీ నటులు, అక్కినేనికి అత్యంత ఆప్తులు – “చిన్నతెరమీద మహానటుడు”; పోణంగి బాలభాస్కర్, పూర్వ ఆకాశవాణి వార్తల చదువరి, దూరదర్శన్ వ్యాఖ్యాత – “భక్తిరస పాత్రల్లో అక్కినేని”; పారా అశోక్ కుమార్, సాహిత్య పరిశోధకులు –“అక్కినేని హేతువాద దృక్పథం”; లక్ష్మీ భవాని, ‘అక్కినేని వీరాభిమాని’ – “సాంఘిక చిత్రాలలో మరపురాని కథానాయకుడు” అంటూ వివిధ కోణాలలో అక్కినేని గారి నటనా జీవితాన్ని చక్కగా విశ్లేషణ చేశారు.

ప్రముఖ ద్వ్యనుకరణ కళాకారుడు భవిరి రవి అక్కినేని గారు ఎలా మాట్లాడతారో అనుకరించి అందరినీ అలరించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Akkineni Foundation of America) వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20 వ తేదీ సాయంత్రం Allen నగరంలో (Dallas, Texas పరిసర నగరం) నెలకొని ఉన్న రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో అక్కినేని సినిమాల నుండి కొన్ని పాటలను ఎంపికచేసి “అక్కినేని చిత్ర గీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ ఒక ప్రత్యేక నివాళిగా అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందరూ పాల్గొనవలసినదిగా ఆహ్వానం పలికారు.

error: NRI2NRI.COM copyright content is protected