- తీరం దాటిన తానా సభ్యత్వ నమోదు తుఫాను
- హాఫ్ సెంచరీ కొట్టిన తానా, సెంచరీ వైపు పయనం
- 2 నెలల్లో రెట్టింపు అయిన సభ్యత్వాలు
- 2015-16 మాదిరి సభ్యత్వ నమోదు
- దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం తరహాలో
- ముందే చెప్పిన ఎన్నారై2ఎన్నారై.కామ్
- రంగంలోకి మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సభ్యత్వ నమోదు తుఫాను జనవరి 31న తీరం దాటింది. అదేంటి సంవత్సరం అంతా ఏరోజైనా సభ్యత్వ నమోదు చెయ్యొచ్చు కదా, ఈ తుఫాను ఈ జనవరి 31 కథ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మీ డౌట్ కూడా కరెక్టే! కాకపోతే జనవరి 31 లోపు సభ్యత్వం తీసుకున్నవారు మాత్రమే 2023 తానా ఎన్నికల్లో వోట్ వేయడానికి అర్హులవుతారు. ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది అనుకుంటా మీకు ఈ తుఫాను ప్రత్యేకత ఏంటో.
కారణాలు ఏమైనప్పటికీ అప్పుడప్పుడు తానాలో ఇలాంటి తుఫానులు వస్తూనే ఉంటాయి. కాకపోతే కొన్ని తుఫానులు ఉప్పెనలా మారతాయి మరికొన్నేమో టీ కప్పులో తుఫానులా ముగుస్తాయి. మరి గత జనవరి 31న తీరం దాటిన తానా సభ్యత్వ నమోదు తుఫాను ఉప్పెనా లేక టీ కప్పులో తుఫానా అని తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
‘తగ్గేదేలే! తానా సభ్యత్వ ఉప్పెనలో ఎవరు ముందున్నారు?‘ అనే శీర్షికన ఎన్నారై2ఎన్నారై.కామ్ గత నెలలో ఒక వార్త ప్రచురించిన విషయం అందరికీ తెలిసిందే. మరిన్ని వివరాలతో దానికి కొనసాగింపే ఈ వార్తావిశేషం. గత నెల వార్తలో మేము ముందుగానే ఊహించినట్టు తానా సభ్యత్వాలు రెట్టింపై 70 వేలు దాటాయి. సుమారు 36 వేల కొత్త సభ్యత్వాలు వచ్చినట్లు వినికిడి. 34 వేల పాత సభ్యత్వాలు కలుపుకొని తానా హాఫ్ సెంచరీ కొట్టి సెంచరీ వైపు పయనం చేస్తున్నట్లుంది. ఇదే వేగంతో వెళితే తానా సెంచరీ కొట్టడానికి ఏంతో దూరం లేదనిపిస్తుంది.
ఈ కొత్త సభ్యత్వాల నంబర్స్ చూస్తే కొంచెం అటో ఇటో గా పర్సెంటేజ్ వైజ్ 2015-16 లో చేర్పించిన సభ్యత్వాల నంబర్స్ కి దగ్గిరగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా కొత్త సభ్యత్వాలు రెట్టింపైయ్యేలా వచ్చాయి. అప్పటిలానే ఇప్పుడు కూడా దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అన్నట్టు ఎక్కడపడితే అక్కడ కన్సల్టెన్సీస్, పని చేసే ఆఫీసులు, స్నేహితులు, బంధుగళం ఇలా అందరినీ బాగా వాడేశారు. కాకపోతే అప్పట్లో రెండు వర్గాలే, కానీ ఇప్పుడు మూడు వర్గాలు.
ఎప్పటిలానే కంగారులో ఒకే అడ్రస్ తో చాలా సభ్యత్వాలను చేర్పించారట. ఇలాంటివి నార్త్ కరోలినా మరియు టెక్సాస్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల భోగట్టా. అందుకే మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ చివరి నిమిషం వరకు ఆగకుండా త్వరగా ధృవీకరించి చెల్లుబాటు అయ్యేవేవో తేల్చడానికి కసరత్తు చేయనున్నట్లు తెలిసింది.
ఇక కొత్త సభ్యత్వాల నంబర్స్ లోకి తొంగిచూస్తే 6 వేలకి పై చిలుకు సభ్యత్వాలతో టెక్సాస్ రాష్ట్రం అన్నిటికంటే ముందు ఉందట. సుమారు 4 వేల సభ్యత్వాలతో కాలిఫోర్నియా రెండవ స్థానంలో, దాదాపు 3.5 వేల సభ్యత్వాలతో వర్జీనియా మరియు న్యూ జెర్సీ మూడవ స్థానం కోసం పోటీపడుతున్నాయట. అనూహ్యంగా నార్త్ కరోలినా 2.5 వేల సభ్యత్వాలతో నాల్గవ స్థానం కైవసం చేసుకుందట. ఇది నిజమైతే అపలాచియన్ ప్రాంతం వచ్చే తానా ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించనున్నట్టే. ఇకపోతే 15 వందలనుంచి 2 వేల వరకు సభ్యత్వాలతో ఐదవ స్థానం కోసం పోటీపడే రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా, ఇలినాయిస్, జార్జియా, మిచిగాన్, ఒహాయో ఉన్నాయట.
అలాగే డోనార్ కేటగిరీలోని ఫౌండేషన్ సభ్యత్వాలు 200 కి చేరుకున్నట్టు సమాచారం. 30 వేల పై చిలుకు కొత్త సభ్యత్వాలను మొత్తంగా చూస్తే, మూడు వర్గాల వారు కూడా ఎవరికి వారు మావి 10 వేలు పైనే ఉంటాయి అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సభ్యత్వ నమోదు తుఫాను ఉప్పెనలానే ఉందనుకోవాలి. అసలు నంబర్స్ బయటకి రావాలంటే మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ రంగంలోకి దిగాల్సిందే. అప్పుడు తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం!