జనవరి 4న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలకు తానా ఫౌండేషన్ లైబ్రరీస్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు పుస్తకాలు అందజేశారు. త్వరలో కంప్యూటర్ మరియు ప్రింటర్ కూడా అందజేయనున్నారు. తన ఇండియా ట్రిప్ లో భాగంగా సతీష్ తానా తరపున ఈ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చుండ్రు సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకుంటే జ్ఞాన సముపార్జన సాధ్యమని, టెక్నాలజీ పెరుగుతున్న నేటి దినాలలో పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గిందని, దీనిపై తానా ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించి పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. తాను పుట్టి పెరిగిన పాఠశాలకు తానా ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకర్తి తదితరుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను లైబ్రరీస్ కో ఆర్డినేటర్లుగా ఉన్న తాను, రమణ అన్నె కలిపి ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు చుండ్రు సతీష్ పుస్తకాలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని సతీష్ పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ చదువుకుని అమెరికాలో ఉన్నా సొంత గ్రామానికి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన చుండ్రు మురళీకృష్ణను సతీష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చుండ్రు అచ్యుతరామారావు, చుండ్రు నరసింహారావు, చుండ్రు మురళీకృష్ణ, డివి రాఘవులు, జి.పద్మావతి, కె.కృష్ణవేణి, కెవి రాంబాబు, వి.వీరబాబు, గున్నం నాగబాబు, సత్తిబాబు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.