Connect with us

Language

మన తరం భాషని నవతరం భాషగా మార్చేలా తెలుగు వైభవం కార్యక్రమం: Chicago Andhra Association @ Mall of India

Published

on

Chicago, Illinois: మన తరం భాషని నవతరం భాషగా మార్చే బృహత్తర కార్యక్రమంలో తమ వంతు సహాయంగా చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు వైభవం కార్యక్రమం ఆద్యంతం వైభవంగా, ఆసక్తిదాయకంగా, వీక్షకులకి ఆహ్లాదకరంగా, తెలుగు భాషాభిమానులకు ఒక పెద్ద పండుగలాగా జరిగింది.

చికాగో ఆంధ్ర సంఘం వారి తెలుగు వైభవం ఆదివారం, డిసెంబర్ 15 2025న మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా చికాగో (Chicago) పరిసర ప్రాంతాల నుంచి తెలుగు భాషాభిమానులు విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి (Srikrishna Mathukumalli) గారి ప్రారంభ ఉపన్యాసంతో మొదలైన ఈ కార్యక్రమాన్ని అన్విత పంచాగ్నుల ఆద్యంతం ఆసక్తిదాయకంగా నిర్వహించారు. సాధారణంగా పిల్లలు విరివిగా పాల్గొనే ఇలాంటి పోటీలలో పిల్లలతో పాటు పెద్దలు కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రయోజకత్వం చేకూర్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులు ఉత్త లేఖనం, సామెతలు పొడుపు కథలు చిత్రలేఖనం నీతి కథలు ఇంకా అనువాదం అనే ఆరు విభాగాల్లో పోటీపడ్డారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా అదే సమయంలో ఉత్సాహపరితంగా సాగిన ఈ పోటీలలో, ముందుగా నమోదు చేసుకున్న వారితో పాటు ఈ కార్యక్రమానికి చూసేందుకు వచ్చిన వారు సైతం ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ పెద్ద సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొని తమకు మాతృభాష (Mother Tongue) పై గల అభిమానాన్ని చాటిచెప్పారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారు, సంస్థ వ్యవస్థాపక సభ్యులు పద్మారావు అప్పలనేని గారి దిశా నిర్దేశంలో, ప్రధాన నిర్వాహకులైన అన్విత పంచాగ్నుల గారు, నరసింహ రెడ్డి ఒగ్గు గారు, సంస్థ ఉపాధ్యక్షులు తమిశ్రా కొంచాడ (Tamishra Konchada) గారు గత నెల రోజులుగా శ్రమించి ప్రణాళిక బద్ధంగా రూపొందించిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.

తెలుగు భాషా సంబంధమైన ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెన్నంటి ప్రోత్సహించే తెలుగు భాషాభిమానులు శ్రీ జయదేవ్ మెట్టుపల్లి (Jayadev Mettupall) గారు, వెంకట్ తుర్లపాటి గారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసి నిర్వహకులను పోటీదారులను అభినందించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా మాలతి దామరాజు గారు, రాధిక గరిమెళ్ళ గారు, మణి తెల్లాప్రగడ గారు, లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారు, యశోద వేదుల గారు, హర్షిత రావెల్ల గారు, సహితి కొత్త గారు వ్యవహరించారు .

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలలో విజేతలను ఎంపిక చేయడం కష్ట తరమైనా, ఎంతో ఓర్పుతో మరిన్ని ఆవృతాలు నిర్వహించి విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు. ఎప్పటిలాగే చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) వారి కార్యనిర్వాహక సభ్యులు శైలజ సప్పా, శృతి కూచంపూడి, హేమంత్ తలపనేని, రామారావు కోతమాసు, మురళి రెడ్డివారి, రమ్య మైనేని, ధర్మేంద్ర గాలి, సురేష్ ఐనాపూడి, సురేష్ మహలి.

ఈ కార్యక్రమం విజయానికి వెన్నెముకలా నిలిచారు. అలాగే ధర్మకర్తలు, వ్యవస్థాపక సభ్యులు అయిన ఉమా కటికీ గారు, రాఘవ జట్ల గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే కాకుండా ప్రత్యక్షంగా పోటీలలో పాల్గొని పోటీదారులను ఉత్సాహపరిచారు. శ్వేత కొత్తపల్లి (Swetha Kothapalli) గారు Raffle నిర్వహించి విజేతలకు ఉచితముగా నూతన సంవత్సర వేడుకల ఆహ్వాన పత్రాలు అందజేయడం అదనపు ఆకర్షణ. 

ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని, గుండెల్లో నిండా సంతోషంతో, ఇంతమంది మాతృభాష అభిమానులను చూసిన ఆనందంతో తిరిగి వెళుతూ,తెలుగు భాషకు చికాగో ఆంధ్ర సంఘం చేస్తున్న విశేష సేవను గుర్తిస్తూ, అందరూ ముక్తకంఠంతో ఇలాంటి భాషా సంబంధమైన కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుండే చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association) అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.

error: NRI2NRI.COM copyright content is protected